జగన్ ఎన్‌కౌంటర్.. మొత్తం 15 మంది మావోల మృతి వెనుక కథ

నిత్యం మీడియాకు సమాచారం అందించే జగన్ మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. జగన్‌తో పాటు మరో 8 మంది చనిపోయారు.

Update: 2024-09-05 08:19 GMT

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో మీడియాకు వారధిగా ఉండే జగన్ అలియాస్ ఏసోబు కూడా చనిపోయారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

జగన్ మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జిగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించేందుకు.. మావోయిస్టులపై చర్యలు కానీ, ఇతర సమస్యలపైనే ఆయన నిత్యం మీడియాకు ప్రెస్‌నోట్ల రూపంలో సందేశం పంపిస్తుండే వారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దానిపై వెంటనే స్పందిస్తూ ఆయన వెంటవెంటనే లేఖ రిలీజ్ చేసే వారు.

నిత్యం మీడియాకు సమాచారం అందించే జగన్ మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. జగన్‌తోపాటు మరో 8 మంది చనిపోయారు. వారంతా వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారే. వారిలో ముఖ్యంగా తెలంగాణకు చెందిన రణధీర్, దాదా ఉన్నారు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఈ ప్రకటన చేశారు. వారితోపాటు పీఎల్జీఏ సభ్యురాలు శాంతి, ఏరియా కమిటీ మెంబర్లు మడకం సుశీల, గంగి ముచికీ, కోసా మడవి, డివిజన్ కమిటీ సభ్యురాలు లలిత, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ గార్డు కవిత, డివిజన్ కమిటీ సభ్యుడు హిడ్మే మడకాం, ప్లాటూన్ సభ్యుడు మల్లేశ్ ఉన్నట్లు ఐజీ తెలిపారు.

ఏసోబు గతంలో చర్చి ఫాదర్‌గా కొనసాగారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులవారిగూడెంకు చెందిన ఏసోబు ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. ఓ దొర దగ్గర పనిచేస్తుండగా.. వారి పెత్తందారిని భరించలేకపోయారు. దాంతో ఉద్యమం పట్ల ఆకర్షితుడై అడవి బాట పట్టారు. 1974లో 21 ఏండ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. అప్పటి నుంచి ఆయన ఎన్నో హోదాల్లో కొనసాగారు. పార్టీ అగ్రనేతలైన కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతికి స్పెషల్ ప్రొటెక్షన్ వింగ్ కమాండర్‌గానే పనిచేశాడు. ఆ తర్వాత కేంద్ర కమిటీ మిలిటరీ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ మిలిటరీ ఇన్చార్జిగా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ బార్డర్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు సైతం ఉంది. మొత్తంగా ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 9 మందిపై రూ.60 లక్షల రివార్డు ఉంది.

అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ గురువారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం ప్రాంత సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల నుంచి ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌కు చిక్కింది లచ్చన్న దళం సభ్యులని చెబుతున్నారు. గ్రేహౌండ్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ఎన్‌కౌంటర్ జరుగగా.. కాల్పుల అనంతరం చేపట్టిన గాలింపులో ఇద్దరు మావోయిస్టులు గాయాలతో పట్టుబడ్డారు.

అయితే.. పోలీసు ఎన్‌కౌంటర్లలో వరుసగా మావోయిస్టు పెద్ద తలలు కోల్పోతుండడంతో వారి మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. ఏవోబీలో కూడా వారి ప్రాబల్యం తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఇటీవల పోలీసు బలగాలను అక్కడ పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ అటవీ ప్రాంతాలపై పట్టుబిగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాలకు తోడు ఏవోబీని కూడా కేంద్రం టార్గెట్ చేసింది. అందుకే.. నిత్యం బలగాలను పంపిస్తూ కూంబింగ్ జరుపుతోంది. దీంతో తలదాచుకునే మార్గం లేక మావోయిస్టులు ఇలా చిక్కి అసులు బాసుతున్నారు.

Tags:    

Similar News