కొంచెం మంచి కేసులు అంట పెట్టండి!
మహిళలు అని కూడా చూడకుండా చిత్ర హింసలకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, కన్వీనర్లే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తుందని.. 41ఏ నోటీసులు ఇవ్వకుండా.. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా.. మహిళలు అని కూడా చూడకుండా చిత్ర హింసలకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వీటిపై ఇప్పటికే స్పందించిన జగన్ పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు! ఇందులో భాగంగా.. ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్లుగానే మీ వ్యవహారశైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నాను. ప్రతీ ఏపీ పోలీస్ అధికారికి చెబుతున్నా.. న్యాయాన్ని గౌరవించండి అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
న్యాయాన్ని గౌరవించండి.. ధర్మాన్ని కాపాడండి.. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ని దగ్గరుండి బయటకు తీస్తాం.. డిప్యూటేషన్ పై పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినా.. సప్తసముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిపై కక్ష సాదింపు చర్యలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆ దంపతులను ఈ నెల 4న అరెస్ట్ చేసి.. వింత వింత కారణాలు చెబుతూ పలు పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారని.. అసభ్య పదజాలంతో దూషిస్తూ రాత్రంతా సిలకలూరి పేట సీఐ రమేష్.. స్టేషన్ లోనే ఉంచారని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గాయాలు చూపించి సుధారాణి దంపతులు కన్నీళ్లు పెట్టుకున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి తుమ్మా బాబుల్ రెడ్డిపై విచిత్రమైన కేసు పెట్టారని.. ఇందులో భాగంగా... పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే కందిపప్పు కేజీకి బదులు 780 గ్రాములు ఉందని పోస్ట్ పెడితే 352 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారని తెలిపింది వైసీపీ!
దీంతో... మరీ ఇలాంటి కేసులు పెడితే.. నిజంగా అత్యంత దారుణమైన పోస్టులు పెట్టినవారిపై పెట్టే కేసులపై కూడా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని.. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగానే ప్రజలు, న్యాయస్థానాలు భావించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.