అసెంబ్లీకి జగన్...క్రెడిట్ కూటమిదేనా ?
వైసీపీ అధినేత జగన్ ఈసారి బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ ఈసారి బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు.
దాంతో ఈసారి సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశాలలోనే రాజకీయంగా దూకుడు చూపించేందుకు అవకాశాలు ఉంటాయని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పధకాల విషయంలో కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని విమర్శలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.
అసెంబ్లీకి తొలినాళ్ళలో వెళ్ళడం కంటే ఇపుడు వెళ్ళడమే మేలు అని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఒక క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చిందని అందువల్ల ప్రతిపక్షంగా తాము నిలదీసినా అది సమంజసమని జనాలు భావిస్తారని కూడా అంచనా వేస్తున్నారు.
సరైన సమయంగా దీనిని భావించే వైసీపీ అధినాయకత్వం అసెంబ్లీకి వెళ్ళాలని అనుకుంటోంది అంటున్నారు. అయితే దీనికి సంబందించి పూర్తి స్థాయిలో వైసీపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎటూ అసెంబ్లీకి వైసీపీ అధినేత జగన్ రావడానికి సిద్ధంగా ఉన్నారని భావించే ఉప సభాపతి రఘురామ అరవై రోజులు అనర్హత వేటు అన్న కామెంట్స్ చేశారా అన్నది కూడా చర్చకు వస్తోంది.
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరు కావడం అన్నది అంటూ జరిగితే ఆయన అనర్హత వేటు విషయంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటారా అన్నది కూడా ఉంది. అంతే కాదు వైసీపీ అసెంబ్లీకి వచ్చే విషయంలో ఈసారి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడడానికి ఇది వ్యూహాత్మమైన ఆలోచనగా చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే అసెంబ్లీకి జగన్ రావాలని లేకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ అసెంబ్లీకి వస్తే ఎవరికి మేలు అంటే కచ్చితంగా అది వైసీపీకే మైలేజ్ ని ఇస్తుంది అని అంటున్నారు. అసెంబ్లీలో నాలుగు పార్టీలు మాత్రమే ఉన్నాయి. అందులో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.
దాంతో విపక్ష స్థానం వైసీపీకే ఉంది. వైసీపీ ఆ విధంగా ఈ అడ్వాంటేజ్ ని అనుకూలంగా చేసుకుంటే కచ్చితంగా ఆ పార్టీకి పొలిటికల్ గా మైలేజ్ దక్కుతుందని అంటున్నారు. అంతే కాదు జనాలు సైతం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని విపక్షం ప్రశ్నించాలని కోరుకుంటారు. అటు వైపు అధికార పక్షం మీద ఒత్తిడి పెట్టాలని కూడా ఆశిస్తారు. ఆ రకంగా విపక్ష పాత్రను వైసీపీ పోషిస్తే కనుక జనాలలో వైసీపీకే ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి వైసీపీ అసెంబ్లీకి నిజంగా రావడం అంటూ జరిగితే కూటమికి ఆ క్రెడిట్ వెళ్తుందా లేదా అన్నది పక్కన పెడితే రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం వైసీపీ తీసుకుంది అన్నది అంతా భావిస్తారు అంటున్నారు.