జగన్ కేజ్రీవాల్ మాజీలు : ఐపాక్ రిషి టీంతో అంతేనా ?
2024 ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీని నామరూపాలు లేకుండా చేసింది ఐప్యాక్ రిషీ టీం ఔట్ డేటెడ్ వ్యూహాలే అని అంతా విమర్శించారు.
ఐప్యాక్ ని నమ్ముకుంటే పొలిటికల్ గా పవర్ కి ప్యాకప్ చెప్పేయడమేనా అన్న చర్చ సాగుతోంది. ఐప్యాక్ అన్నది ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలో ఉన్నపుడు బ్రహ్మాండంగా నడచింది. ఎపుడైతే రిషీ టీం చేతుల్లోకి వెళ్ళిందో అధికారంలో ఉన్న వారు మాజీలు అవుతున్నారు. దానిని అచ్చమైన ఉదాహరణగా నిన్న జగన్ నేడు అరవింద్ కేజ్రీవాల్ కనిపిస్తారు. 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీని నామరూపాలు లేకుండా చేసింది ఐప్యాక్ రిషీ టీం ఔట్ డేటెడ్ వ్యూహాలే అని అంతా విమర్శించారు.
వారిని నమ్మి నిండా వైసీపీ మునిగింది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ పట్టవు. క్యాడర్ అసలు అవసరం లేదు, లీడర్స్ ని అంతకంటే పట్టించుకోరు. సంక్షేమ పధకాలు అమలు చేశాం ఇవే గెలిపిస్తాయని అంతపురం లో కూర్చుని వ్యూహ రచన చేశారు. దాంతో పార్టీగా వైసీపీ ఎంత దెబ్బ తిందో అంతా చూశారు.
ఇదే ఐప్యాక్ టీం 2019లో జగన్ ని పార్టీని సవ్య దిశగా నడిపించింది. దానికి కారణం ఆనాడు ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. ఆయన క్యాడర్ ని బూస్టప్ చేస్తూ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. పార్టీని పటిష్టం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అంతే కాదు ప్రచార్మలో కొత్త పుంతలు తొక్కించారు. వినూత్నమైన ఆలోచనలతో వైసీపీని ముందుకు నడిపించారు.
ఆ తరువాత ఐప్యాక్ కాస్తా రిషి టీం చేతిలోకి వెళ్ళింది, వైసీపీ అధికారం పోగొట్టుకోవడమే కాకుండా పాతాళానికి పోయింది. కట్ చేస్తే అదే ఢిల్లీ ఎన్నికల్లోనూ జరిగింది. 2020లో కేజ్రీవాల్ రెండోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు గానూ ఆయన 62 సీట్లు గెలుచుకున్నారు. దాని వెనక పీకే సారధ్యంలోని ఐప్యాక్ టీం ఉంది.
కానీ 2024 ఎన్నికల్లో సారధ్యం చేసింది రిషీ టీం. దాంతో ఆప్ కి చావు దెబ్బ తగిలింది. ఏపీలో ఏమి చేశారో అదే స్ట్రాటజీస్ ని వాడారు. ఉచితాల మీద ప్రచారం చేసారు. పైగా గ్రాస్ రూట్ లెవెల్ ని టచ్ చేయలేకపోయారు. బీజేపీ దూకుడుగా దూసుకొస్తూ కేజ్రీవాల్ అని అవినీతిపరుడు అని ఆరోపిస్తున్న వేళ దానిని అధిగమిస్తూ జనాలను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలను రచించడంలో రిషి టీం వైఫల్యాలు కనిపించాయని అంటున్నారు.
ఒక వైపు కేజ్రీవాల్ ని అవినీతిపరుడు అంటూ బలంగా బీజేపీ జనంలోకి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయగలిగింది. అదే సమయంలో వాటిని తిప్పికొట్టడంతో పాటు బీజేపీ పాలనలో లోపాలను ఎండగట్టాల్సిన ఆప్ వ్యూహాలు తిరగబడ్డాయి. సెల్ఫ్ డిఫెన్స్ ని కూడా చేసుకోలేక చతికిలపడ్డారు. దాంతోనే ఆప్ ఓటమిని మూటకట్టుకుంది అంటున్నారు.
ఇక రిషీ టీం ఫెయిల్యూర్ రికార్డులను ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. గోవా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కి ఎన్నికల వ్యూహాలను రచించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఈ టీం అక్కడ ఆ పార్టీని కనీసంగా నిలబెట్టలేకపోయింది. హర్యానా ఎన్నికల్లో ఆప్ ని సోది లోకి రాకుండా చేయగలిగింది అని అంటున్నారు.
మరి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న రిషీ టీం సక్సెస్ ని అందిస్తుందా అన్నది చర్చగా ఉంది. వ్యూహాలు ఎప్పటికపుడు మార్చాలి. ప్రజల నాడి పట్టుకోవాలి. నేల విడిచి సాము చేయకూడదు, కానీ వైసీపీని ఆకాశంలో పెట్టి ఎన్నికలను నడిపించాలని చూసింది ఈ టీం అని విమర్శిస్తారు. ఇక రిషీ టీం ని వైసీపీ కంటిన్యూ చేస్తుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆప్ ఫలితాల తరువాత అయినా పునరాలోచించుకోవాలని అంటున్నారు. లేకపోతే ఏమైనా జరగవచ్చు అంటున్నారు.
ఏ రకమైన వ్యూహాలు ఎందుకు జనాలలో క్యాడర్ తో కనెక్ట్ అవుతూ పార్టీని పునర్ నిర్మించుకుంటే కనుక కచ్చితంగా వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు. మరి వైసీపీ హైకమాండ్ ఐప్యాక్ సేవలను కొనసాగిస్తుందా లేదా అన్నది ఒక ఆసక్తికరమైన చర్చగానే పార్టీలో సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.