సభను వదిలేసి.. కడపకు జగన్.. రీజనేంటి?
ఒకవైపు.. ఏపీ అసెంబ్లీలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్.. తన సొంత జిల్లా కడప పర్యటనకు వెళ్లారు.
ఒకవైపు.. ఏపీ అసెంబ్లీలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్.. తన సొంత జిల్లా కడప పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కడపకు అనూహ్యంగా పర్యటన పెట్టుకున్నారు. వాస్తవానికి అసెంబ్లీకి జగన్ వస్తారని ఎదురు చూశారు. కానీ, ఆయన సభను వదిలేసి.. కడపకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
కాగా.. జగన్ పర్యటనకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కేవలం ప్రజాదర్బార్ నిర్వహించేందుకు మాత్రమే ఆయన కడప పర్యటన పెట్టుకున్నట్టు తాడేపల్లి కార్యాలయ వర్గాలుపేర్కొన్నారు. బాక్రాపురంలోని తన నివాసం చేరుకున్న జగన్.. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్భార్ నిర్వహిస్తారు. పులివెందుల నియోజకవర్గం ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. అదేవిధంగా .. గతంలో ఇచ్చిన అర్జీల వివరాలను కూడా తెలుసుకోనున్నారు.
ఇక, స్థానికంగా పార్టీ నాయకుడి ఇంట్లో జరిగే ఓ వివాహ వేడుకకు జగన్ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే.. పులివెందులలో వైసీపీ నాయకుల మధ్య గత కొన్నాళ్లుగా జరుగుతున్న వివాదాలను కూడా ఆయన పరిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సహా పలువురు కీలక నాయకులు ఉన్నారు. ఇటీవల ఆకేపాటిపై ప్రభుత్వం భూకబ్జా కేసు పెట్టిన నేపథ్యంలో ఆయన నుంచి కూడా వివరాలు తెలుసుకుంటారు.
భారీ స్వాగతం
జగన్ పులివెందులకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. గజమాలతో స్వాగతం చెప్పేందుకు కొందరు ప్రయత్నించగా.. జగన్ వారించారు. మరికొందరు.. ఎదురొచ్చి స్వాగతం చెప్పారు. అనంతరం.. ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో పోలీసులు భారీ సంఖ్యలో పోలీసులను ఏర్పాటు చేసి.. భద్రత కల్పించారు. ఇటీవల గుంటూరు పర్యటనలో తనకు భద్రత కల్పించలేదన్న విమర్శల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది.