జగన్ లేడు.. జోష్ లేదు!!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. శాసన మండలిలో వైసీపీ వర్సెస్ ప్రభుత్వ పక్షాల మధ్య వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. శాసన మండలిలో వైసీపీ వర్సెస్ ప్రభుత్వ పక్షాల మధ్య వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. అసెంబ్లీలో మాత్రం ఒంటరి పోరాటమే జరుగుతోంది. సభలో వైసీపీ నాయకులు గైర్హాజరయ్యారు. సోమవారం గవర్నర్ ప్రసంగానికి వచ్చిన వైసీపీ అధినేత పులివెందు ల ఎమ్మెల్యే వైఎస్ జగన్.. మరుసటి రోజు అంటే.. మంగళవారం.. రాకూడదని తీర్మానం చేసుకున్నారు. దీంతో అసెంబ్లీలో విపక్ష సభ్యుల సీట్లు బోసిపోయాయి.
ఇక, చిత్రం ఏంటంటే.. అధికార కూటమి పక్షం సభ్యులు కూడా.. పెద్దగా హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా.. తమ తమ వ్యవహారాలకే పరిమితమయ్యారు. వచ్చిన వారు కూడా.. ఒకటి రెండు అంశాలు ప్రస్తావించి మౌనం వహించారు. పైగా.. అందరి చూపూ.. విపక్షం వచ్చే గుమ్మాలవైపే ఉండడం గమనార్హం. సహజంగా.. విపక్షం.. కుడివైపు కేటాయించిన గుమ్మంలోంచి సభలోకి అడుగు పెడుతుంది. అధికార పక్షం.. స్పీకర్‌కు ఎదురుగా ఉన్న గుమ్మం వైపు నుంచి వస్తుంది.
చిత్రం ఏంటంటే.. కుడి వైపు తెరిచి ఉన్న డోర్ల నుంచి అసెంబ్లీ వ్యవహారాల సిబ్బంది.. రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఎవరు వచ్చినా.. అటు వైపు ఎవరి నీడ కనిపించినా.. సభ్యులు ఆసక్తిగా జగన్ ఏమైనా వస్తున్నాడేమోనని చూశారు. అంతేకాదు.. స్పీకర్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నవారు.. తరచుగా కుడి వైపు డోర్ల వైపు చూశారు. దీనిని గమనించిన.. స్పీకర్.. మీరు నా వైపు చూసి మాట్లాడండి! అని చమత్కరించా రు. అంతేకాదు.. రాని వాళ్ల గురించి ఆలోచన ఎందుకు? అని బీజేపీ సభ్యుడి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మరోవైపు.. అధికార పక్షంలోనూ.. నారా లోకేష్ మండలికే పరిమితం కాగా.. సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన కార్యాలయంలో బడ్జెట్ కుస్తీ చేస్తున్నారు. దీంతో అధికార పక్షం సభ్యులు కొందరు మాత్రమే గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పందించారు. మొత్తానికి జగన్ లేకపోవడంతో అధికార పార్టీ నాయకుల్లోనూ జోష్ లేదన్న వాదన అయితే.. వినిపించడం గమనార్హం.