స్థానికంలో పట్టు జారుతోంది.. ప్రమాదమే జగనూ...!
ఎందుకంటే.. పై స్థాయిలో నాయకులు బలంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో జెండా మోసేవారు.. జెండాలు కట్టేవారు.. కట్టించేవారు చాలా చాలా ముఖ్యం;
స్థానికంలో పట్టు కోసం పార్టీలు ప్రయత్నిస్తాయి. ఎందుకంటే.. పై స్థాయిలో నాయకులు బలంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో జెండా మోసేవారు.. జెండాలు కట్టేవారు.. కట్టించేవారు చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా.. పార్టీలకు ఇబ్బందే. అందుకే.. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ హయాంలో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను గమనించిన ఆయన రోడ్డెక్కారు.
తద్వారా.. పార్టీకి కీలకమైన క్షేత్రస్థాయి స్థానిక నాయకులు, కార్యకర్తలను నిలుపుకొనే ప్రయత్నాలు చేశా రు. ఇది కీలకమైన బలంగా మారి.. కూటమి అధికారంలోకి వచ్చేందుకు సాయం చేసింది. అయితే.. ఇప్పుడు వైసీపీ స్థిమితంగా ఉన్న క్షేత్రస్థాయి బలం కూలిపోతోంది. నాయకులు ఉన్నా.. చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. తమ స్వలాభం తాము చూసుకుంటున్నారు. చిన్నపాటి కాంట్రాక్టుల కోసం.. గత బిల్లుల కోసం.. చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.
మరికొందరు కేసుల భయంతో వెనక్కి తగ్గుతున్నారు. దీంతో స్థానికంగా వైసీపీ కూకటి వేళ్లు కదులుతున్నాయి. నిజానికి పాదయాత్రల ద్వారా..జగన్ స్థానికంగా యువతను ఎంతో ఆకర్షించారు. దీంతో వైసీపీకి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెరిగింది. అయితే.. కూటమి వచ్చి న తర్వాత.. మొదలు నరికేసే రాజకీయాలు.. చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయం అంటేనే ఇంత!
ఈ నేపథ్యంలో వైసీపీనే అలెర్టు కావాలి. కానీ అధినేత తాడేపల్లి గడప దాటడం లేదు. పైగా.. ఇక్కడ కూర్చుని ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో స్థానికంగా అనేక కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కూడా.. కూటమి వైపు మళ్లుతున్నాయి. ఇది మున్మందు.. వైసీపీకి పెద్ద విపత్తుగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి.. ఇప్పటికైనా.. అధినేత దిగి వచ్చి.. స్థానికంగా ఉన్న తన బలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే.. చివరకు తాడేపల్లి, జగన్ మాత్రమే మిగులుతారని వైసీపీలోనే నాయకులు అభిప్రాయపడుతున్నారు.