చంద్రబాబు కన్నా వంశీ, కొడాలి అందగాళ్లు..! జగన్ సెటైర్లు

ఎప్పుడూ సీరియస్ కామెంట్స్ చేసే మాజీ ముఖ్యమంత్రి జగన్.. వంశీతో ములాఖత్ అనంతరం ఫన్నీ కామెంట్లు చేశారు.

Update: 2025-02-18 10:05 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై మాజీ సీఎం జగన్ సెటైర్లు పేల్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలు వద్దకు వచ్చిన జగన్.. ములాఖత్ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వంశీ ఎందుకు టార్గెట్ అయ్యాడనే ప్రశ్నకు జగన్ సెటైరికల్ గా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కన్నా వంశీ, కొడాలి నాని, అవినాశ్ అందంగా ఉండటంతోనే ఓర్వ లేకపోతున్నారని, వారి సామాజికవర్గంలో చంద్రబాబు, లోకేశ్ మాత్రమే లీడర్లుగా ఉండాలని కోరుకుంటారని విమర్శించారు.

ఎప్పుడూ సీరియస్ కామెంట్స్ చేసే మాజీ ముఖ్యమంత్రి జగన్.. వంశీతో ములాఖత్ అనంతరం ఫన్నీ కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను టార్గెట్ చేసుకుని ఆయన వేసిన సెటైర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ ఏం మాట్లాడరంటే.. ‘‘తన సామాజికవర్గం నుంచి ఒకరు ఎదుగుతున్నారు అంటే చంద్రబాబు ఓర్వలేరు. వంశీ చంద్రబాబు నాయుడు కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేశ్ కన్నా గ్లామరస్గా ఉన్నాడు. అందుకని కొడాలి నాని చూసినా, వంశీని చూసినా చంద్రబాబుకు జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు కన్నా చక్కాగా ఉంటారు కాబట్టి. అవినాశ్ కూడా ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు. ఎందుకంటే లోకేశ్ కన్నా చక్కగా ఉంటాడు కాబట్టి. ఇది చంద్రబాబు గారి మనస్తత్వం. ఆయన, ఆయన కొడుకు. ఆ సామాజికవర్గంలో వారు మాత్రమే లీడర్లు. ఆ సామాజికవర్గంలో ఎవరైనా వాళ్లకు అనుకూలంగా లేకపోతే వెలివేయడం. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం.’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తమ పార్టీలో ఉన్న వంశీ, కొడాలి నాని, అవినాశ్, శంకర్ రావు, బ్రహ్మనాయుడును చంద్రబాబు తన సామాజికవర్గం నుంచి దూరం చేస్తున్నారని ఆరోపించారు. వారు ఆ సామాజికవర్గంలో తప్పుగా పుట్టారు. వాళ్లు అన్యాయస్తులు అంటూ చంద్రబాబు తన సామాజికవర్గంలో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీలో ఉన్న చంద్రబాబు సామాజికవర్గ లీడర్లపై తప్పుడు కేసులు, ఇల్లీగల్ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై బురద చల్లడం, ట్రోల్ చేయించడం అన్నీ చంద్రబాబు నైజమంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. సాధారణంగా జగన్ ప్రసంగాల్లో సీరియస్ కామెంట్స్ మాత్రమే ఉంటాయి. ముఖంపై చెరగని చిరునవ్వుతో కనిపించినా, ఆయన మాటల్లో కానీ, విమర్శల్లో కాని వ్యంగ్యం పెద్దగా కనిపించదు. కానీ, విజయవాడ సబ్ జైలు వద్ద మాత్రం తొలిసారిగా జగన్ సెటైరికల్ గా మాట్లాడటం ఆకర్షించింది. ఆయన మాటలు విన్నవారు జగన్ లో ఈ ఫన్నీ యాంగిల్ కూడా ఉందా? అంటూ చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News