వంశీతో జగన్ ములాకత్.. పోలీసులకు సీరియస్ వార్నింగ్
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ను ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ను ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ములాఖత్ లో వంశీని కలిసేందుకు వెళ్లిన జగన్.. పార్టీ అన్నివిధాలుగా తోడుంటుందని భరోసా ఇచ్చారు. వంశీ భార్య పంకజశ్రీ, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ తో కలిసి జైలు లోపలికి వెళ్లిన జగన్ వంశీని ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కొందరు పోలీసులు కూటమి నేతల తొత్తులుగా పనిచేస్తున్నారని జగన్ ఆరోపించారు. ‘‘పోలీసులు తమ టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి. టీడీపీ నేతలకు సెల్యూట్ కొ్టి, వారి చెప్పినట్లు పనిచేస్తూ జనాలకు అన్యాయం చేస్తే బాగోదు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతాం’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరినీ వదిలిపెట్టం, రిటైరైనా, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తాం అంటూ హెచ్చరించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించిన జగన్.. వంశీని అరెస్టు చేసి తీరు దారుణమంటూ ఖండించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కేసును ఉపసంహరించుకున్నా, పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని గుర్తు చేశారు. ఈ కేసులో తొలుత వంశీ పేరు ఎక్కడా లేదు. దాడి ఘటనలో వంశీ లేరు. వంశీని 71వ నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఘటన జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయానని సత్యవర్ధన్ చెప్పాడు. సత్యవర్ధన్ ను తీసుకెళ్లి తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇక ఈ విషయంలో సంచలన విషయాన్ని బయటపెడతామని వైసీపీ తన ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ఈ రోజు రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం, అతిపెద్ద రహస్యం బయటపడనుంది అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
కాగా, వంశీతో జగన్ ములాఖత్ కు సంబంధించి వైసీపీ నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. జగన్ తోపాటు వీరిద్దరూ కూడా ఈ రోజు ములాఖత్ లో వంశీని కలుస్తారని ఒక రోజు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ ఇద్దరినీ ఈ రోజు జైలు అధికారులు అనుమతించలేదు. మాజీ సీఎం జగన్ తోపాటు వంశీ సతీమణి పంకజశ్రీ, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబును మాత్రమే అనుమతించారు. మరోవైపు సబ్ జైలు వద్దకు జగన్ రావడంతో ఆయనను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక బందోబస్తు చర్యల్లో భాగంగా జైలు వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.