ఆ పంతమే.. జగన్‌కు శాపం ..!
పంతం-నీదా-నాదా.. అంటూ.. వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు.. ఆయనకు పార్టీకి కూడా నష్టం తెస్తోందని అంటున్నారు పరిశీలకులు
పంతం-నీదా-నాదా.. అంటూ.. వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు.. ఆయనకు పార్టీకి కూడా నష్టం తెస్తోందని అంటున్నారు పరిశీలకులు. సహజంగా రాజకీయాల్లో ఉన్నవారికి ఉండాల్సింది.. వ్యూహం-ఆలోచన, ఎత్తులు-పై ఎత్తులు.. తద్వారానే పార్టీలు, నాయకులు కూడా పుంజుకుంటారు. కానీ, పంతానికి పోయిన పార్టీ కానీ, నాయకులు కానీ రాజకీయాల్లో నిలిచి గెలిచిన చరిత్ర లేదు. ఈ విషయం జగన్ కు తెలుసో.. తెలియదో కానీ.. ఆయన పంతానికి పోతున్నారన్న మాట అయితే.. వైసీపీలోనే ఎక్కువగా ఉంది.
గతంలో కాంగ్రెస్‌తో పంతానికి పోయి పార్టీ పెట్టుకున్నారు. ఒకే ఒక్కసారి సక్సెస్ అయి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత.. నుంచి అనుసరించిన పంతంతో కూడిన వైఖరి జగన్ కు మేలు చేయకపోగా.. కీడునే చేసింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. ఇసుక వ్యవహారం జోలికి పోవద్దన్న మాటలను ఆయన ఖాతరు చేయలేదు. దీంతో కీలకమైన మాస్ ఓటింగ్ దెబ్బతింది. ఇక, మద్యం జోలికి వెళ్లొద్దని.. ధరలు పెంచొద్దని చెప్పినా.. వినలేదు. పంతానికి పోయారు. ఇది కూడా ఓటమికి దారితీసేలా చేసింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. సొంత చెల్లి షర్మిల రోడ్డున పడి.. తనకు అన్యాయం చేశాడని అరుపులు, పెడబొ బ్బలు పెట్టినప్పుడు కూడా.. తాడేపల్లి ప్యాలస్ వీడి బయటకు రాలేదు. ఈ పంతానికి కూడా మూల్యం చెల్లించుకున్నారు. ఇక, ఆ తర్వాత.. బీజేపీతో పొత్తు విషయంలోనూ మైనారిటీ ఓటు బ్యాంకుకు భయపడి చేతులుకాల్చుకున్నారు. ఇలా.. అధికారంలో ఉండగా చేసిన పంతం.. అన్నీ విధాలా నష్టం చేసింది. పోనీ.. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. పంతం వీడారా? అంటే అది కూడా లేదు.
అసెంబ్లీని 11 మందితోనే వినియోగించుకుని.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే.. ఆ మార్పు స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు ప్రజల తరఫున సభలో ప్రశ్నించే గళం లేకుండా పోయిందన్న గ్యాప్.. వైసీపీకి మరింత ఇబ్బందిగా మారింది.కేవలం ప్రతిపక్ష నేత అనే హోదా కోసం వెంపర్లాడుతూ.. పంతానికి పోతున్న తీరుతో పార్టీపై ప్రజల్లో ఉన్న చిన్నపాటి సానుభూతిని కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. సో.. పంతం అన్ని వేళలా మేలు చేయదన్న కీలక సూత్రాన్ని జగన్ గ్రహిస్తే.. మంచిందని పరిశీలకులుచెబుతున్నారు.