జగన్.. ఈ వంద రోజుల్లో పదోసారి!
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లిపోయారు.
నిన్నటి దాకా విజయవాడలో ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన, ఇప్పుడు శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారనే ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ రెండు ఘటనల్లో వేళ్లన్నీ వైసీపీ నేతల వైపే చూపిస్తున్నాయని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లిపోయారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఒకే ఒక్కసారి మాత్రమే బెంగళూరు వెళ్లారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఈ వంద రోజుల్లోనే ఆయన, తన సతీమణి భారతితో కలిసి పదోసారి బెంగళూరు తరలిపోయారని చెబుతున్నారు.
ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి దాదాపు ప్రతివారం వీకెండ్ లో జగన్, తన సతీమణితో కలిసి బెంగళూరులోని నివాసానికి వెళ్లిపోతున్నారని టాక్ నడుస్తోంది. మళ్లీ వారం ప్రారంభంలో తాడేపల్లికి వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మళ్లీ వారాంతంలో సతీమణితో సహా జగన్ బెంగళూరు నివాసానికి తరలిపోతున్నారని గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వంద రోజుల్లోనే జగన్ పదోసారి బెంగళూరుకు వెళ్లడం వెనుక ఆసక్తికర చర్చ నడుస్తోంది. వాస్తవానికి జగన్ కు హైదరాబాద్ లోటస్ పాండ్ లోనూ నివాసం ఉంది. అయితే అక్కడ వైఎస్ జగన్ సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ నివాసం ఉంటున్నారు. లోటస్ పాండ్ నివాసంలో జగన్ కు, షర్మిలకు ఇద్దరికీ వాటాలున్నాయని సమాచారం. అయితే వైఎస్ షర్మిలతో వచ్చిన రాజకీయ విభేదాలతో జగన్ లోటస్ పాండ్ నివాసానికి వెళ్లడం లేదని అంటున్నారు.
2019లో ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు కూడా వైఎస్ జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలోనే ఉండేవారు. రాజకీయ కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారు.
ఇప్పుడు అధికారం పోయాక జగన్ హైదరాబాద్ కు కాకుండా బెంగళూరుకు తరచూ వెళ్తుండటం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో ఉండటానికి ఇష్టం లేకే జగన్ బెంగళూరులో ఉంటున్నారని చెబుతున్నారు.
అంతేకాకుండా జగన్ కాంగ్రెస్ కూటమి (ఇండియా)కు దగ్గరవుతున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉంది. టీడీపీ, జనసేన ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ బెంగళూరుకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ద్వారా జగన్ కాంగ్రెస్ కూటమికి దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ అధికారాన్ని కోల్పోయారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇంకోవైపు కేంద్రంలో చక్రం తిప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. లోక్ సభకు కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే గెలిచారు. రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉన్నా వారిలో ఇద్దరు వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా తమ పదవుల నుంచి కూడా వైదొలిగారు. మరికొందరు వీరి బాటలోనే ఉన్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ వైఎస్ జగన్ కు చక్రం తిప్పడానికి అవకాశం లేకపోవడంతోనే ఆయన తరచూ బెంగళూరు బాటపడుతున్నారని అంటున్నారు.
జగన్ హైదరాబాద్ వెళ్లకపోవడానికి ఇంకో కారణం కూడా వినిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనపై గతంలో జగన్ పలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రేవంత్ సీఎం అయినప్పుడు మర్యాదపూర్వకంగానైనా జగన్ శుభాకాంక్షలు తెలపకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ కంటే కూడా బెంగళూరుకు వెళ్లడానికే జగన్ ఇష్టపడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐదేళ్లూ జగన్ ఇలా బెంగళూరుకు, విజయవాడకు షటిల్ సర్వీస్ చేస్తారని టాక్ నడుస్తోంది.