జగన్ లో అంత మార్పు తెచ్చిన ఆ ఎంపీ ఎవరు ?
జగన్ అంటే జగమొండి అని చెబుతారు. ఆయన మాటే శాసనం. ఆయన ఏది చెబితే అది జరగాల్సిందే.
జగన్ అంటే జగమొండి అని చెబుతారు. ఆయన మాటే శాసనం. ఆయన ఏది చెబితే అది జరగాల్సిందే. ఆయనను కాదన్న వారు వైసీపీలో ఉండలేరు. ఇక తనను చూసి జనాలు ఓట్లేస్తారు అని జగన్ అనుకుంటారు. ఎవరు ఉన్నా పోయినా లెక్క చేయరు. అలాంటి జగన్ మాత్రం తన వైఖరికి భిన్నంగా బాగా తగ్గారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఆయన అలా తగ్గి కొన్ని హామీలు కూడా ఇచ్చారు అని అంటున్నారు.
మరి అంతలా జగన్ ని తగ్గించి తన హామీలను మెప్పించుకున్నా ఆ ఎంపీ ఎవరూ అన్న చర్చ అయితే ప్రస్తుతం సాగుతోంది. ఆయన ఎవరో కాదు రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు. ఆయన పేరు మొదటి నుంచి జంపింగ్ జాబితాలో వినిపిస్తూనే ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావు పేట నుంచి ముమ్మారు ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావుని జగన్ ఇదే ఏడాది రాజ్యసభకు పంపి ఆ ప్లేస్ లో శ్రీకాకుళానికి చెందిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు టికెట్ ఇచ్చారు.
ఒక విధంగా బాబూరావుకు ఇది ప్రమోషన్ కింద లెక్క. 2030 దాకా ఆయన పదవికి ఢోకా అయితే లేదు. ఒకవేళ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కి ఉంటే టీడీపీ కూటమి వేవ్ లో ఓటమి చెందేవారు అని అంటున్నారు. అలా ఆయన లక్కీ అని కూడా చెప్పుకున్నారు. అయినా సరే బాబూరావులో తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకుని ఉందిట. దానికి కారణం రాజ్యసభలో పార్టీ తరఫున నియామకాలలో ఆయనకు అవకాశాలు లేవు. ఇక ఏ మీడియా మీటింగ్ అయినా ఆయన మాట్లాడేందుకు కూడా చాన్స్ ఇవ్వడంలేదు.
అంతే కాదు అధినేతతో అపాయింట్మెంట్ కూడా పార్టీ ఓడినా దక్కడం లేదు అన్నది మరో బాధ. ఇక తన వారసుడిగా కుమారుడికి పాయకరావుపేట టికెట్ ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఇవేమీ నెరవేరేవి కావు అని ఇక వైసీపీలో దక్కిన ఈ రాజ్యసభ గౌరవంతో వేరే పార్టీలోకి షిఫ్ట్ కావాలని ఆయన అనుకున్నారు అని చెబుతారు.
ఇక జగన్ రాజ్యసభ ఎంపీలతో అర్జంటుగా తాజాగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దానికి గొల్ల బాబూరావు డుమ్మా కొట్టారు అని కూడా వార్తలు వినిపించాయి. ఈ మొత్తం పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ ఆయనతో నేరుగా ఫోన్ కలిపారు అని ప్రచారం సాగుతోంది. సాధారణంగా జగన్ ఎవరికీ ఫోన్ చేయరు. అయితే బాబూరావు ఆలోచనలు అసంతృప్తి అన్నీ పార్టీ నేతలు జగన్ దృష్టిలో పెట్టడంతో ఆయన హడావుడిగా ఫోన్ చేసి మరీ బాబూరావుతో అన్నీ చర్చించారు అని అంటున్నారు
బాబూరావు డిమాండ్లకు ఓకే చెప్పడమే కాకుండా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. దాంతో పాయకరావుపేటలో బాబూరావు కుమారుడికి టికెట్ ఇస్తున్నారు అన్న మాట. అలాగే వైసీపీ ముఖ్య నేతలతో పాటు మీడియాలో బాబూరావు ఇక మీదట కనిపిస్తారు అని అంటున్నారు. అలాగే బాబూరావుకు పార్టీ పదవులలో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.
మొత్తానికి జగన్ నేను ఇంతే తగ్గేది లేదు అన్న వైఖరి నుంచి ఆయనను మార్చి తన దారిలోకి తెచ్చుకున్న బాబూరావు ఇపుడు హాట్ టాపిక్ అయిపోయారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ పార్టీ ఎంపీల విషయంలో వారిని కాపాడుకునేందుకు వరసగా మెట్లు దిగి వచ్చారు అని అంటున్నారు. పార్టీ అధినేత అంతే ఇలాగే చేయాలని కూడా అంటున్నారు.