జగన్ వచ్చేంతవరకూ అంతేనా ?

వైసీపీలో చిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. అంది వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో ఆ పార్టీ ఎప్పటికప్పుడు విఫలం అవుతుంది.

Update: 2025-01-15 12:03 GMT

వైసీపీలో చిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. అంది వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో ఆ పార్టీ ఎప్పటికప్పుడు విఫలం అవుతుంది. దాని ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ వ్యూహాలలో దిట్ట. సంక్షోభాలను సైతం రాజకీయ పార్టీ ఎదిగేందుకు సోపానాలుగా మార్చుకోవడం టీడీపీకే చెల్లుతుంది. ఏ చిన్న అవకాశం వదులుకోకుండా టీడీపీ పనిచేస్తుంది. కానీ వైసీపీ మాత్రం దీనిని భిన్నమని అంటారు.

ఇదిలా ఉంటే ఏపీలో పెద్ద పండుగ వచ్చింది. ధరలు ఆకాశానికి అంటాయి. అలాగే ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు చార్జీల రేట్లను పెంచేసి జనాలకు పండుగ సరదా తీర్చేశారు. ఇక ఎక్కడ చూసినా కోడి పందేలు సాగుతున్నాయి. గుండాట వంటి ఇతర ఆటలు యధేచ్చగా ఆడుతున్నారు.

నిజానికి విపక్షం చేపట్టాలీ అంటే కాదేదీ అనర్హం అన్నట్లుగా సమస్యలు కనిపిస్తాయి. కానీ వైసీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరించింది. ఆ పార్టీ ఓటమి తరువాత పెద్దగా ఉనికిని చాటుకోని నాయకుల లిస్ట్ చూస్తే కొండవీటి చాంతాడు అంత ఉంటుంది అని చెబుతారు.

అదే అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వైఖరిని ఒక్కసారి చూస్తే కనుక ప్రతీ ఏటా భోగీ రోజున గతంలో చంద్రబాబు అయితే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను భోగీ మంటలలో వేసి ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచేవారు. ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మరో సారి పెరిగిన విద్యుత్ బిల్లులను ఇంకోసారి నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఇలా ఏదో ఒక నిరసన కార్యక్రమం తీసుకునే వారు.

మరి వైసీపీకి ఇలాంటి ఇష్యూసే దొరకలేదా అన్న చర్చ సాగుతోంది. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది అతి పెద్ద అంశంగా ఉంది. మరో వైపు చూస్తే సీపీఎం ఈ ఇష్యూ మీద భోగీ మంటలలో ప్రైవేట్ పత్రాలను వేసి ఆందోళన చేపట్టింది. అలా ధరా భారాల మీద ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం ఏ చిన్నపాటి ఆందోళన చేయకుండా మిన్నకుండిపోయింది. జగన్ అయితే ఫిబ్రవరి నుంచి జనం లోకి రావాలని అనుకుంటున్నారు. ఆయన వస్తారులే అన్నీ ఆయన చూసుకుంటారులే అన్న ధోరణిలో ఫ్యాన్ పార్టీ ఉందని అంటున్నారు. జగన్ అయితే ఇపుడు లండన్ టూర్ కి వెళ్తున్నారు. ఆయన ఈ నెలాఖరు దాకా తిరిగి రారు. అంతవరకూ ఇదే రకమైన సైలెన్స్ అయితే వైసీపీలో కంటిన్యూ అవుతుందనే అంటున్నారు.

అంతే కాదు పార్టీ నేతలు కూడా ఏ యాక్టివిటీ చేయకుండా మిన్నకుండడంతో క్యాడర్ సైతం నిస్సత్తువగా ఉంది. ప్రజా సమస్యల మీద ఆందోళన చేయడానికి నేతలు ముందుకు రాకపోవడంతో ఏపీలో అంతా బాగుంది అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని వైసీపీ కార్యకర్తలు వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు.

Tags:    

Similar News