షర్మిలతో ఇష్యూ : పులివెందులలో జగన్ న్యూ స్ట్రాటజీ
ఇక ఆయన ఎన్నడూ లేని విధంగా బంధువుల ఇళ్ళ వద్దకు వెళ్ళడం ఈసారి పర్యటన విశేషం.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందులలో మూడు రోజుల పాటు గడిపారు. ఆయన ఈ సందర్భంగా ప్రజలతో మమేకం అయ్యారు. అంతేకాదు పార్టీ నేతలతో మీటింగ్స్ పెట్టారు. ఇక ఆయన ఎన్నడూ లేని విధంగా బంధువుల ఇళ్ళ వద్దకు వెళ్ళడం ఈసారి పర్యటన విశేషం.
జగన్ పులివెందులలోని వైఎస్సార్ కుటుంబ సభ్యులందరితోనూ విడివిడిగా చర్చించారు అని తెలుస్తోంది. కొందరి ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్లారని కూడా అంటున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డితో, అలాగే చిన్నాన్న మనోహర్ రెడ్డితో, మేనమామ రవీంద్రనాధ్ రెడ్డితో కూడా జగన్ షర్మిలతో వచ్చిన ఆస్తుల విభేదాల అంశం మీద చర్చలు జరిపినట్లుగా తెలిసింది.
ఇక వైఎస్సార్ కుటుంబంలో పెద్దాయంగా ఉన్న జగన్ పెదనాన్న అయిన వైఎస్ ప్రకాష్ రెడ్డి ఇంటికి జగన్ స్వయంగా వెళ్ళి ఆయనతో ఏకంగా అరగంటకు పైగా ఏకాంత మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ రెడ్డి మొత్తం కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారు.
ఆయన పట్ల అందరూ గౌరవ మర్యాదలు చూపిస్తారు. ఆయన సైతం అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉంటారు అని చెబుతారు. దాంతో జగన్ ఆయనతో తమ కుటుంబంలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాల మీద చర్చించినట్లుగా తెలుస్తోంది.
తన తల్లి సోదరితో ఏర్పడిన వివాదాల మీద ఒక మంచి పరిష్కారం వచ్చేలా చూడాలని పెదనాన్నను జగన్ కోరారని అంటున్నారు. అందుకు ఆయన కూడా అంగీకరించారు అని కూడా అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో మరో సమస్య లేనట్లుగా జగన్ ఆస్తుల విషయం మీద అటు అన్న చెల్లెలు ఇద్దరి వివాదాలే నడుస్తున్నాయని అంటున్నారు. దీంతో వైసీపీలో కూడా ఒక రకమైన అలజడి రేగుతోంది.
ఒక వైపు ఎన్నడూ లేని విధంగా పార్టీ రాజకీయంగా దెబ్బ తిని ఉంది. నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నారు. మరో వైపు చూస్తే పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సొంత ఇంటి నుంచే తనకు ఇబ్బందులు రావడం పట్ల జగన్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. జమిలి ఎన్నికలు దేశంలో జరుగుతాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో పార్టీని ఇప్పటి నుంచే చక్కదిద్దుకోకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీని పటిష్టం చేసే పనిలో పడుతున్న వేళ ముందుగా ఇంటి సమస్యలను చక్కదిద్దుకోవాలని జగన్ నిర్ణయించారు అని అంటున్నారు. చెల్లెలుతో తల్లితో ఆస్తుల వివాదాన్ని సెటిల్ చేసుకుంటేనే తప్ప అడుగులు ముందుకు వేయలేమని గ్రహించిన జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడానికే పులివెందుల టూర్ లో తనదైన ప్రయత్నాలు స్టార్ట్ చేశారు అని అంటున్నారు.
జగన్ సంపాదించుకున్న ఆస్తి అంతా ఆయన స్వార్జితమని ఒక వాదన ఉంది. అయితే అది కుటుంబ ఆస్తి అని చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ అంటున్నారు. మరి ఈ విషయంలో చెల్లెలుకు జగన్ ఎంత ఇవ్వబోతున్నారు అన్నది చూడాలి. 2019 లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 40 శాతం వాటాను చెల్లెలుకు ఇచ్చి ఆ వివాదానికి శాశ్వతమైన ఫుల్ స్టాప్ పెడతారా అన్నది కూడా చర్చకు వస్తోంది.
మొత్తం మీద చూస్తే వైసీపీ వర్గాలు కూడా ఎంత తొందరగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడితే అంత మంచిదని కూడా సలహా ఇస్తున్నాయి. మొత్తం మీద పెదనాన్న ప్రకాష్ రెడ్డి ఈ పంచాయతీ పెద్దగా పూర్తిగా ఈ సమస్యను తీర్చగలరా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆయన మాటను అంతా గౌరవించి ఒప్పదానికి వస్తే కనుక ఇక ఆస్తుల వివాదమే కాదు చెల్లెలుతోనూ సమస్యలు ఉండవు. ఆ మీదట ఎవరి రాజకీయం వారిదే అన్నట్లుగానూ ఉంటుంది అని అంటున్నారు.