వైసీపీ నేతల అసెంబ్లీ గైర్హాజరుపై జగన్ కీలక వ్యాఖ్యలు!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-02-06 11:49 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు అధికారంలోకివచ్చి 9 నెలలు గడుస్తున్నా అవి అమలుకు నోచుకోవడానికి ఏమాత్రం సంబంధం లేదంటూ విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా... తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ప్రక్రియపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూ కొత్తవి ఇస్తానన్న చంద్రబాబు.. నేడు రెండింటికీ మంగళం పాడేశారని అన్నారు. ఈ సమయంలో అసెంబ్లీ గైర్హాజరుపై స్పందించారు.

అవును... గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. దీంతో... కనీసం 18 సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని ఏపీ స్పీకర్ నుంచి క్లారిటీ వచ్చిన పరిస్థితి. దీంతో.. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఎవరూ అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు!

ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన జగన్.. ఈ విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా... అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని అన్నారు. మాట్లాడటానికి సమాయం ఇస్తేనే కదా తాము అసెంబ్లీకి వెళ్లేది, సాధారణ ఎమ్మెల్యేలాగానే తనకూ సమయం కేటాయిస్తే ఎలా అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో పాలక పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయని.. ఈ సమయంలో మిగిలిన అన్ని పార్టీలూ అధికారపక్షమే అయినప్పుడు.. ఉన్న ఒక్క ప్రతిపక్ష పార్టీకీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. ఆ హోదా ఇస్తే చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకే హోదా ఇవ్వడం లేదని జగన్ తెలిపారు.

ఈ విషయంపై తాము ఇప్పటికే కోర్టుకు వెళ్లామని.. అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోర్టుకు ఎందుకనో స్పందించడం లేదని.. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లకపోవడానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలని.. స్పీకరే చెప్పాలని జగన్ అన్నారు.

Tags:    

Similar News