మందు భలే పసందు...జగన్ కి దొరికిందా సందు ?

తమ ప్రభుత్వం మద్యం షాపులను సగానికి సగం నియంత్రిస్తే మళ్లీ నాలుగు వేలకు పైగా షాపులు తెచ్చారని దీంతో ఏపీకి ఇబ్బందే అని జగన్ అంటున్నారు.

Update: 2024-10-14 17:28 GMT

ఏపీలో మద్యం దుకాణాల హడావుడి ఒక రేంజిలో ఉంది. దరఖాస్తులు చేసుకోవడానికే రెండు లక్షల ఫీజు పెడితే ఏకంగా ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చి పడింది. ఇక మద్యం దుకాణాల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. లాటరీ బేసిస్ లో మద్యం దుకాణాలను ఇచ్చిన అంతా సిండికేట్ వ్యవస్థ మయం కాబట్టి అయిన వాళ్ళకే మందు షాపులు దక్కాయని అంటున్నారు

ఒకే మందు షాపునకు అనేక మంది దరఖాస్తు చేస్తే పోతే రెండు లక్షలు వస్తే అయిదేళ్ల పాటు మందు షాపుల బిజినెస్ అనుకుంటూ వేసిన ఈ ముందస్తు వ్యూహం బ్రహ్మాండంగా ఫలించింది. దాంతో ఏపీలో ఇపుడు మద్యం సిండికేట్ల చేతిలలోకి మద్యం వ్యాపారం వెళ్లిపోయింది. మంచి సెంటర్లు చూసి మందు షాపులు తెరచేందుకు రంగం సిద్ధం అయింది. తమ ప్రాంతాలలో మందు దుకాణాలు వద్దు అని అపుడే మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఆందోళనలు కూడా పెరుగుతోంది.

రానున్న రోజులలో ఇది ఏ విధంగా నిరసనలకు దారి తీస్తుందో చూడాల్సిందే. మందు షాపులకు భారీ ఎత్తున సొమ్ము చెల్లించి లైసెన్సులు తెచ్చుకున్న వారికి బిజినెస్ భారీగా సాగిపోవాలి. దాంతో వారు ప్రధాన కూడళ్ళనే ఎంచుకుంటున్నారు.

అయితే వాడవాడలా మందు షాపులు వెలిస్తే మహిళలు ప్రజా సంఘాల గోడు చెప్పనలవి కాదు, గతంలో కూడా ఇదే జరిగింది. అక్కడికి వచ్చి మందు తాగిన వారు చేసే అల్లరి లా అండ్ ఆర్డర్ కి కూడా విఘాతమే అని అంటున్నారు.

అయితే మందుని ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. గతంలో ప్రభుత్వం మందు షాపులు నడిపినా మందు వ్యసనం ఆగలేదు, ఇపుడు ప్రైవేట్ లో మరింత విచ్చలవిడితనం పెరుగుతుంది. దీంతో ఇది విపక్షాలకు మరీ ముఖ్యంగా వైసీపీకి ఆయుధంగా మారుతుందా అన్న చర్చ సాగుతోంది.

దీనిని కరెక్ట్ గానే వాడుకోవాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారు అనడానికి ఆయన తాజాగా వేసిన ట్వీట్ ఉదాహరణగా చూడాల్సి ఉంది. లిక్కర్ పాలసీతో ఏపీ సిండికేట్లకు అడ్డాగా మారిపోయింది అని జగన్ కామెంట్స్ చేశారు. మందు షాపులు అన్నీ తమ వారికే తెచ్చుకోవడంతో కూటమి నేతలు సక్సెస్ అయ్యారని ఇది వారి అవినీతికి పెద్ద స్కెచ్ అని జగన్ విరుచుకుపడ్డారు.

ఈ మద్యం వ్యాపారంతో రానున్న అయిదేళ్లలో అధిక రాబడికి దోపిడికీ ద్వారాలు తెరచారు అని కూడా విమర్శించారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక రేట్లకు మందు అమ్మేందుకు కూడా రెడీ అయ్యారని ఆయన కామెంట్స్ చేశారు.

పేద ప్రజల ఆదాయన్ని మద్యం తో గుల్ల చేసి సర్వం స్వాహా చేయడానికే ఈ లిక్కర్ పాలసీ అని జగన్ నిలదీస్తున్నారు. ఈ కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సిండికేట్ చేతుల్లోకి పోతుందని పేదల బతుకులు మరింతగా చితికిపోతాయని జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే మద్యం అమ్మితే రేట్లకు ఒక నియంత్రణ ఉంటుందని అలాగే అమ్మకం వేళలు కూడా కరెక్ట్ గా ఉంటాయని ప్రైవేట్ వారి చేతులోకి పోతే రాత్రీ పగలూ అమ్ముకుంటూ పోతరని తమకు నచ్చిన రేట్లు పెట్టుకుంటారని కూడా జగన్ అంటున్నారు.

ఇదే తీరుగా 2014 నుంచి 2019 దాకా పాలించి రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారని ఇపుడు కొత్త లిక్కర్ పాలసీ పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని ఆదాయాన్ని గండి కొట్టి కాసులు ఏరుకునే కార్యక్రమానికి తెర తీశారు అని జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం మద్యం షాపులను సగానికి సగం నియంత్రిస్తే మళ్లీ నాలుగు వేలకు పైగా షాపులు తెచ్చారని దీంతో ఏపీకి ఇబ్బందే అని జగన్ అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం మందు పాలసీ జగన్ కి సందు దొరికేలా చేసిందా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News