మోపిదేవి మీద జగన్ హాట్ కామెంట్స్

వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీద వైసీపీ అధినేత హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-10-10 16:21 GMT

వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీద వైసీపీ అధినేత హాట్ కామెంట్స్ చేశారు. రేపల్లె నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రమణ అన్నకు న్యాయమే చేశామని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయినా ఆయనను ఎమ్మెల్సీ చేసి కేబినెట్ లోకి తీసుకున్నామని అన్నారు.

ఆ తరువాత శాసనమండలిని రద్దు చేయాలనుకున్నపుడు ఆయనకు రాజ్యసభ ఇచ్చి పదవిలో ఉంచామని గుర్తు చేశారు. ఇంత చేసినా ఆయన వైసీపీని వీడివెళ్ళారని అన్నారు. మోపిదేవి తాజాగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో వైసీపీకి మోపిదేవి రాజీనామా చేసిన సమయంలో జగన్ ఏ విధంగా బాహాటంగా స్పందించలేదు.

అయితే రేపల్లె మోపిదేవి సొంత నియోజకవర్గం కావడం, నిన్నటిదాకా ఆయన వైసీపీ నేతగా ఉండడంతో ఆయన వెళ్ళిపోయినా ఆ ప్రభావం క్యాడర్ మీద పడకుండా ఉండేందుకు ఆయనకు ఏమి తక్కువ పార్టీ చేయలేదు అన్న సంకేతాన్ని జగన్ పంపించారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ నుంచి వెళ్ళిన నేతల విషయంలో జగన్ కొంత అంతర్మధనం చెందుతున్నారా అన్న చర్చ కూడా ఉంది.

ఇక చంద్రబాబు 2024 ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని జగన్ ఆరోపించారు. ఆయన అబద్ధాలు మోసాలను ప్రజలు నాలుగు నెలల వ్యవధిలోనే తెలుసుకున్నారు అని అన్నారు. బడ్జెట్ ని కూడా ఏపీలో ప్రవేశపెట్టలేకపోయారని కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

తాము ప్రతీ ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టి అందులోనే సంక్షేమ కేలండర్ ని రిలీజ్ చేశామని అన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా వైసీపీ ప్రభుత్వం వాటి గురించి ప్రజలకు చెప్పకుండా ఏ సాకులూ వెతకకుండా పధకాలను అమలు చేసింది అన్నారు. ఈ రోజుల టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క పధకం కూడా అమలు చేయలేకపోతోందని అన్నారు.

వారు ఇంటింటికీ తిరిగి జనాలను ఎలా కలవగలరు అని జగన్ ప్రశ్నించారు. అయిదేళ్ళ పాలన ప్రతీ కార్యకర్త తలెత్తుకునేలా చేశామని అన్నారు. అందువల్ల గర్వంగా వైసీపీ క్యాడర్ ప్రతీ ఇంటికీ వెళ్లవచ్చు అన్నారు. కష్టాలు ఎల్ల కాలం ఉండవని చీకటి తరువాత వెలుగు వస్తుందని జగన్ కేడర్ కి దిశా నిర్దేశం చేశారు.

తాను పదహారు నెలలు జైలులో ఉన్నానని తమ మీద అక్రమంగా కేసులు పెట్టారని అయినా ప్రజలు తనను సీఎం గా చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల క్యాడర్ మనో ధైర్యం కోల్పోవద్దని ఆయన సూచించారు. బాగా పనిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్న్నారు. మొత్తం మీద చూస్తే జగన్ రేపల్లె క్యాడర్ కి చెప్పినా మొత్తం పార్టీ కార్యకర్తలకే తనదైన సందేశం ఇచ్చారని అంటున్నారు. ఇక మోపిదేవి మీద జగన్ చేసిన కామెంట్స్ కి ఆయన నుంచి ఏ రకమైన రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News