వైఎస్సార్ ని తలపించేలా జగన్ ఆ పని చేయబోతున్నారా ?
వైఎస్సార్ వారసుడిగానే జగన్ కి గుర్తింపు. ఆ విషయం అందరికీ తెలుసు. వైఎస్సార్ జన నాయకుడు.
వైఎస్సార్ వారసుడిగానే జగన్ కి గుర్తింపు. ఆ విషయం అందరికీ తెలుసు. వైఎస్సార్ జన నాయకుడు. ఆయన రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహంగా ఉండేవారు. ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కేవలం అయిదుంపావు ఏళ్ళ కాలంలోనే ఎనలేని కీర్తిని అందుకున్నారు. ఆయన దివంగతులైనా అందుకే జనం గుండెలలో నిలిచారు.
ఆయన కుమారుడిగా రాజకీయలలో అరగేంట్రం చేసిన జగన్ సీఎం అయ్యేంతవరకూ వైఎస్సార్ బాటనే నమ్ముకున్నారు. కానీ 2019లో అద్భుతమైన మెజారిటీతో ఎప్పుడైతే అధికారం అందుకున్నారో నాటి నుంచి తనదైన మార్క్ కోసం తపించారు అని చెబుతారు. ఆయన తన పంధాలోనే అయిదేళ్ళ పాలన చేశారు.
ఫలితం చాలా దారుణం అని 2024 ఎన్నికలు నిరూపించాయి. వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు ప్రజా దర్బార్ నిర్వహించేవారు. ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలలోనూ ఆయన పర్యటించారు. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకు కూడా టైం ఇచ్చేవారు. వైఎస్సార్ వద్దకు ఏ అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్లగలిగే చనువు చొరవ కలిగిన వారు ఎంతో మంది ఆనాటి కాంగ్రెస్ లో ఉండేవారు.
వైఎస్సార్ అలా ప్రజా నాయకుడిగా నిలిచారు. జగన్ విషయమే తీసుకుంటే అయిదేళ్ళలో జనం వద్దకు వచ్చినది బహు తక్కువ. అది కూడా పరదాల మాటున భారీ సభలు ఏర్పాటు చేసి తాను ప్రసంగం చేసి వెళ్ళిపోయేవారు. అలా క్షేత్ర స్థాయికి దూరం అయ్యారు. వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకుని క్యాడర్ ని దూరం చేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఇక పార్టీ నేతలను కూడా తన చుట్టూ ఉన్న కోటరీ కారణంగా కలుసుకోలేకపోయారు అన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఇలా భారీ ఓటమి తరువాత చూసుకుంటే వైసీపీ అధినాయకత్వానికి తత్వం తెలిసివచ్చిందని అంటున్నారు. తాడేపల్లిలో నాయకులతో ఆయన ఇపుడు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్ ని కలిసేందుకు జిల్లా టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇపుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వైఎస్సార్ బాటలోనే అది ఉండబోతోంది అని అంటున్నారు.
దాని పేరే ప్రజా దర్బార్. మరి జగన్ ఏ కొత్త పేరు పెడతారో తెలియదు కానీ తన ఇంటి వద్ద ప్రతీ రోజూ ప్రజలతో మమేకం కావడానికి ఆయన ఒక భారీ కార్యక్రమాన్ని తీసుకుని వస్తున్నారు అని తెలుస్తోంది. తనను కలిసేందుకు వచ్చే జనాలకు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా జగన్ వారితో కలవబోతున్నారు అన్నది ఇపుడు వైసీపీలో లేటెస్ట్ టాక్.
ఇలా తనను కలిసే జనాల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం, వారి సమస్యలను పూర్తిగా వినడం విపక్ష పార్టీగా వాటి మీద ప్రభుత్వం దృష్టిలో ఉంచేందుకు ఎలుగెత్తి చాటాలనుకోవడం వంటివి జగన్ మార్క్ ప్రజా దర్బార్ లక్ష్యాలు అని అంటున్నారు. ఇక తన ఇంటికి వచ్చే వారు ఎండన పడకుండా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే వారికి పెరుగన్నం, సాంబారు వంటి ఆహారం కూడా అందచేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలోనే ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటున్నారు. ప్రతీ రోజూ ఉదయం రెండు గంటల పాటు జగన్ ఈ విధంగా జనంతో మమేకం అవుతారని అంటున్నారు. ఇక ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అన్నది తెలియడం లేదు కానీ సాధ్యమైనంత తొందరలోనే ఉండొచ్చు అని అంటున్నారు. ఒక విధంగా ఇది వైసీపీకి కలసి వచ్చే కార్యక్రమం గానే అంతా చూస్తున్నారు. వైసీపీ ఇప్పటిదాకా జనంతో నేరుగా కనెక్ట్ కావడం లేదు,
జగన్ జిల్లా టూర్లు కూడా ఎప్పటి నుంచి ఉంటాయో తెలియడంలేదు. దాంతో ఇపుడు ప్రజలతో కలసి వారి సమస్యలు తెలుసుకోవడం ద్వారా వైసీపీ తాను పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకునే పనిలో ఒక అడుగు వేసినట్లే అని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ఒక ఆకర్షణీయమైన పేరుని పెట్టాలని అనుకుంటున్నారుట. మొత్తం మీద చూస్తే జగన్ కి తన తండ్రి వైఎస్సార్ బాట ఎంత గొప్పదో ఎంత అవసరమో ఓటమి తరువాత గుర్తుకు వస్తోందని అంటున్నారు. వైఎస్సార్ బాటలో ఈ విధంగా వైసీపీ అధినేత నడిస్తే ఫ్యాన్ పార్టీకి మంచి రోజులు వచ్చినత్లే అని అంటున్నారు.