కుడి భుజం తెగిపడింది...జగన్ రియాక్షన్ ?
అలా దశాబ్దాల ప్రయాణంలో ఆయన జగన్ తో కలసి వైసీపీలో కీలకంగా మారారు.
జగన్ తో పాటే పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపిన నాయకుడు విజయసాయిరెడ్డి. ఆయన జగన్ కి కుడి భుజం లాంటి వారు. జగన్ కి తలలో నాలుకగా మెలిగారు. ఒక్క జగన్ మాత్రమే కాదు వైఎస్సార్ కుటుంబానికి మూడు తరాలుగా సన్నిహితుడు. అలా దశాబ్దాల ప్రయాణంలో ఆయన జగన్ తో కలసి వైసీపీలో కీలకంగా మారారు.
వైసీపీ విజయంలో ఆయన పాత్ర ఉంది. వైసీపీ వ్యూహాలలో ఆయన అతి ముఖ్య పాత్ర పోషించారు. ఢిల్లీ స్థాయిలో వైసీపీకి తలలో నాలుకగా మెలిగారు. అటువంటి విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా చెప్పడం అంటే వైసీపీకి రాజకీయ ప్రకంపనల కిందనే భావించాలి.
మరీ ముఖ్యంగా జగన్ కుడి భుజం తెగింది అన్న మాట కూడా ఉంది. వైసీపీ పద్నాలుగేళ్ళ రాజకీయ ప్రస్తానంలో విజయసాయిరెడ్డి ప్రస్థావన చాలా చోట్ల ఉంటుంది. మరి జగన్ అత్యంత సన్నిహితుడిగా హితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇపుడు ఇలా పార్టీకి జగన్ కి దూరం కావడం అంటే వైసీపీకి అది ఆశనిపాతం అని అంటున్నారు.
వైసీపీ ఎన్నడూ లేనంతగా రాజకీయ సంక్షోభంలో ఇపుడు ఉంది. వరసబెట్టి ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీల లిస్ట్ చూస్తే ఇప్పటికి ముగ్గురు రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో అది నాలుగుకు చేరుకుంటుంది. వైసీపీకి సంబంధించి రాజ్యసభలో పార్టీ నేతగా విజయసాయిరెడ్డి ఉన్నారు.
మరి ఆయన హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే లోపాయికారీ ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పార్టీలో ఆయనకు మునుపటి మాదిరిగా ఆదరణ అయితే లేదు అన్న మాట కూడా వినిపిస్తోంది. పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారని చెబుతారు. అయితే ఆయనను టార్గెట్ గా చేసుకుని విపక్షం స్వపక్షం విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అయినా వాటిని అధిగమించి ఆయన ముందుకు సాగారు. అటువంటి ఆయన ఇపుడు ఎందుకు రాజకీయ వైరాగ్యం వైపు మొగ్గు చూపారు అన్నది చర్చగా ఉంది. జగన్ తో ఆయనకు ఉన్న సంబంధాలు ఎంతో గట్టివని భావిస్తూ వచ్చారు. వైసీపీలో ఆయన ప్లేస్ గొప్పది అని అనుకుంటూ వచ్చారు. తాను జీవించి ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను అని చెబుతూ వచ్చిన విజయసాయి రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు రాజీనామా రాజకీయ సన్యాసం అంటున్నారు అంటే ఆయనకు వచ్చిన కష్టం ఎంతటితో అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం లండన్ ట్రిప్ లో ఉన్న విజయసాయిరెడ్డి ఈ నెలాఖరుకు ఏపీకి వస్తారు. ఆయన ప్రవాసంలో ఉండగా విజయసాయిరెడ్డి అతి పెద్ద బాంబు పేల్చారు. మరికొద్ది గంటలలో తాను మాజీ ఎంపీని అవుతాను. రాజకీయాలలోనూ మాజీని అవుతాను అని సంచలన ప్రకటన చేశారు. దీని మీద జగన్ ఏ విధంగా రియాక్టు అవుతారు అన్నదే ఇపుడు అంతా ఆసక్తిని చూపిస్తున్నారు
విజయసాయిరెడ్డి పార్టీకి రాజకీయాలకు దూరం కావడం అందునా ఈ క్లిష్ట సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వైసీపీకి భారీ రాజకీయ నష్టం అని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయన ఈ ఇష్యూ ని ఏ విధంగా టేకప్ చేస్తారో. దాని ఫలితం పర్యవసానం ఎలా ఉండబోతోందో.