తగ్గేదేలే చంద్రబాబు.. ఎన్ని కేసులుకైనా రెడీ : జగన్ సెన్సేషనల్ ట్వీట్

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ముఖ్యమంత్రి మిర్చి రైతుల కోసమే వెళ్లిన్నట్టుగా యథావిధిగా కలరింగ్‌ ఇస్తున్నారని ఎక్స్ లో జగన్ విమర్శించారు.

Update: 2025-02-21 10:09 GMT

కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు తాను భయపడనని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల కోసం పని చేస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ సీఎం జగన్.. తాను రైతు పక్షపాతినని ప్రకటించుకున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ముఖ్యమంత్రి మిర్చి రైతుల కోసమే వెళ్లిన్నట్టుగా యథావిధిగా కలరింగ్‌ ఇస్తున్నారని ఎక్స్ లో జగన్ విమర్శించారు.

మిర్చి ధరల పతనంపై ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన తనకు పోలీసు భద్రత కల్పించలేదని మాజీ సీఎం జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు మిర్చి రైతుకు మద్దతు ధర ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మిర్చి రైతులను మోసం చేసి, ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖరాయడం ఏంటి? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని గుర్తు చేశారు. మీరు బాధ్యతను వేరేవాళ్లమీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటిసాకులు వెతుక్కోవడం ఏంటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు జగన్.

మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తనపై కేసులు గురించి మాట్లాడిన విషయాన్ని జగన్ ఎక్స్ లో ప్రస్తావించారు. ‘‘మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతాను.’’ అంటూ స్పష్టం చేశారు. ఇప్పటికైనా మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మిర్చి ఘాటు అధికార, విపక్షాలను బాగానే తాకినట్లుందని ఈ ట్వీట్ వార్ తో స్పష్టమైందని అంటున్నారు.

Tags:    

Similar News