భయపెట్టిన హెలికాఫ్టర్.. కారులో వెళ్లిపోయిన జగన్
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.;

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎం భద్రతను తగ్గించేస్తోందని ఆరోపిస్తోంది. మంగళవారం సత్యాసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన జగన్ కు సరైన భద్రత కల్పించలేదని వైసీపీ విమర్శించింది. అరకొరగా పోలీసు బందోబస్తు కల్పించడంతో జనం తాకిడి ఎక్కువై జగన్ వచ్చిన హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందని వైసీపీ చెబుతోంది. దీంతో తిరుగు ప్రయాణంలో జగన్ హెలికాఫ్టర్ లో కాకుండా రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లాల్సివచ్చిందని వైసీపీ తెలిపింది.
మాజీ సీఎం జగన్మోహనరెడ్డి భద్రతపై ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. రామగిరి పర్యటనకు వెళ్లిన జగన్ బందోబస్తుకు సరైన భద్రత కల్పించలేదని ఆ పార్టీ ఓ ప్రకటనలో ఆరోపించింది. హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడం, జనం తాకిడి పెరిగి హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాజీ సీఎం జగన్ కు కనీస భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అంటూ ప్రశ్నిస్తోంది.
రామగిరి పర్యటనలో చోటుచేసుకున్న ఘటన తర్వాత వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. భద్రత లేకపోవడం వల్ల హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయాయి. వీఐపీ సెక్యూరిటీ దృష్ట్యా తాము హెలికాఫ్టర్ నడపలేమని పైలట్ చేతులెత్తేయడంతో మరో గత్యంతరం లేక మాజీ సీఎం జగన్ రోడ్డుమార్గంలో బెంగళూరు వెళ్లారంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. గతంలో కూడా మాజీ సీఎం జగన్ బందోబస్తులో లోటుపాట్లు జరిగాయని తెలిపింది. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్య నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి వెళ్లిన మాజీ సీఎం జగన్ కు డొక్కు కారు సమకూర్చారంటూ గుర్తుచేస్తోంది. అదేవిధంగా గత నెలలో గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన సందర్భంలోనూ సరిపడా సెక్యూరిటీ కల్పించలేదని చెబుతోంది. జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుచేసిన వైసీపీ, తాజా పరిణామం తర్వాత మరోమారు కేంద్రం పెద్దలను కలిసి జగన్ బందోబస్తుపై తమ ఆందోళన తెలియజేయాలని నిర్ణయించారంటున్నారు.