జగన్ కి సోషల్ మీడియా గుర్తుకు వచ్చింది!

మెయిన్ స్ట్రీమ్ మీడియా వైసీపీని పక్కన పెట్టిన రోజులలో ఒక బలమైన అస్త్రంగా సోషల్ మీడియా వైసీపీకి అండగా నిలిచింది.

Update: 2024-11-30 14:30 GMT

సోషల్ మీడియా వైసీపీకి పదునైన ఆయుధం అనంది అందరికీ తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియా వైసీపీని పక్కన పెట్టిన రోజులలో ఒక బలమైన అస్త్రంగా సోషల్ మీడియా వైసీపీకి అండగా నిలిచింది. వైసీపీ గురింది మంచిని జనాలకు తెలియజేయడంతో పాటు ప్రత్యర్ధులు చేసే విమర్శలను ధాటీగా తిప్పికొట్టడంలో వైసీపీ సోషల్ మీడియా నిర్వహించిన పాత్ర గొప్పదనే చెప్పాలి.

ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వేళ సోషల్ మీడియా ఆ పార్టీకి రక్షణ కవచంగా నిలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడానికి కూడా కారణం అయింది. అంతటి సోషల్ మీడియాని వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో దూరం చేసుకుంది. వారిని అసలు పట్టించుకోలేదు.

దాంతో పార్టీ కోసం అభిమానంగా పనిచేసిన వారు అంతా మెల్లగా సైలెంట్ అయిపోయారు. అది 2024 ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపించింది. అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ చేసిన మంచి పనులను కూడా చెప్పుకోలేక చతికిలపడింది. ఇదంతా గతం. అయితే ఇపుడు మళ్లీ జగన్ సోషల్ మీడియా ఆవశ్యకతను గుర్తించారు అని అంటున్నారు.

తాజాగా పార్టీ క్యాడర్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సాధారణ కార్యకర్త నుంచి ఎంపీ వరకూ అందరూ సొషల్ మీడియాలో ఉండాలని కోరారు. అంతా ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సప్ వంటి సొషల్ మీడియా వేదికలతో కనెక్ట్ కావాలని దిశా నిర్దేశం చేశారు.

గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ ఏ రకమైన అన్యాయం ప్రజలకు జరిగినా వాటిని వెంటనే వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని జగన్ కోరారు. ఒక సంవత్సరం పూర్తి అయ్యేసరికి ప్రతీ ఇంట్లో ప్రజలు చంద్రబాబుని టీడీపీని ప్రశ్నించే స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా తన ప్రతాపం చూపించాలని జగన్ కోరారు.

మొత్తానికి చూస్తే సోషల్ మీడియాతో వైసీపీ కనెక్షన్ తెగింది అన్న సత్యాన్ని జగన్ బాగానే గుర్తించారు అని అంటున్నారు. గతంలో సోషల్ మీడియా ఎంతో శక్తివంతంగా ఉన్న నాడు దానిని పదిలపరచుకుని పటిష్టం చేసుకుని ఉంటే ఈ రోజున మళ్లీ ఈ రకమైన పిలుపు అధినాయకత్వం స్థాయిలో ఇచ్చి ఉండే అవకాశం వచ్చేది కాదు కదా అని అంటున్నారు.

వైసీపీ సోషల్ మీడియా ఇపుడు పూర్తిగా వీక్ అయింది. మరో వైపు చూస్తే వారిలో నైతికంగా కూడా ధీర్యం స్థైర్యం దెబ్బ తిన్నాయని అంటున్నారు. ఇక అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో వైసీపీ క్యాడర్ పోస్టులు పెడితే వెంటనే కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దాంతో ఆ కాస్తా అభిమానం ఉన్న వారు కూడా ఇపుడు సైడ్ అయిపోయారు అని అంటున్నారు

సోషల్ మీడియాలో చురుకుగా పాలుపంచుకోవాలని జగన్ కోరడం వరకూ బాగానే ఉంది కానీ సగటు కార్యకర్త ఇంటికి వచ్చి పోలీసులు కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ల వెంట తిప్పుతూంటే ఎవరు అండగా ఉంటారు ఎవరు భరోసా ఇస్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

వైసీపీ కోసం ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకుని ఈ రోజున కష్టపడితే రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం మరోసారి వస్తే అపుడు కష్టపడిన క్యాడర్ కి గుర్తింపు ఇస్తారా లేక 2019 నుంచి 2024 వరకూ ఉన్నట్లుగానే పట్టించుకోకుండా పక్కన పెడతారా అన్న ప్రశ్నలు కూడా వైసీపీ క్యాడర్ లో వస్తున్నాయని అంటున్నారు.

వాళ్ళను కనీసం పట్టించుకుంటారా అన్న మాట కూడా క్యాడర్ నుంచి వస్తోంది. నిజానికి ఇది చాలా పెద్ద చర్చ. పార్టీ కోసం పదేళ్ళ పాటు అలుపు లేకుండా పనిచేసిన వారు అయిదేళ్ల అధికారంలో ఏమీ కాకుండా పోయారు. దాంతో ఒక విధంగా వారు పూర్తి నిరాశలో నిర్లిప్తంగా ఉన్నారు.

అలాంటి వారిని దారిన పెట్టాలీ అంటే కచ్చితంగా వైసీపీ అధినాయకత్వం నుంచి గట్టి భరోసా ఉండాలి. అంతా సోషల్ మీడియాకు కనెక్ట్ అవండి అని దిశా నిర్దేశం చేస్తే సరిపోదని అంటున్నారు. అపుడే వైసీపీ క్యాడర్ పూర్వం మాదిరిగా రీ యాక్టివ్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినాయకత్వం చేసుకున్న స్వయంకృపరాధం వల్లనే బలమైన నమ్మకం కలిగిన సోషల్ మీడియా వింగ్ ఈ రోజు ఇలా దూరం అయింది అని అంటున్నారు. ఇపుడు కొత్త పార్టీ మాదిరిగా అంతా మళ్లీ యాక్టివ్ కావాలని కోరాల్సి వస్తుంది అంటే పూర్తి స్థాయిలో పెద్దలు ఆలోచించుకోవాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News