నో అసెంబ్లీ.. పట్టువీడని జగన్
ఇక వాకౌట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్.. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేశారు.
వైసీపీ అధినేత జగన్ పంతం వీడలేదు. పట్టు సడలించలేదు. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు సభకు వెళ్లకూడదనే తన నిర్ణయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జగన్. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లిన వైసీపీ.. పది నిమిషాల్లోనే వాకౌట్ చేసింది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశామని ప్రకటించింది. కారణం ఏదైనా జగన్ సభలో అడుగుపెట్టడంపై తీవ్ర చర్చ జరిగింది. ఇక వాకౌట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్.. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేశారు.
సభలో తాము కాకుండా వేరే ఏ పార్టీ ప్రతిపక్ష స్థానంలో లేదని, అయినా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఏంటని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపించడం లేదని చెప్పిన జగన్.. హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా తాను ఇంకా 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
2028లోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పార్టీ నేతలు ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షహోదా ఇస్తే హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సివుంటుందని ఎమ్మెల్యేలతో జగన్ చెప్పారు. సభా నాయకుడితో సమానంగా సమయం ఇవ్వాల్సివుంటుందనే కారణంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం లేదు కనుక ప్రెస్ మీట్ల ద్వారా ప్రజా సమస్యలపై పోరాడం చేద్దామని పిలుపునిచ్చారు.