ఆ రోజు నుంచి జనంలోకి జగన్ ?

ఇలా కనుక అన్నీ చూసుకుంటే జూలై 8న వైఎస్సార్ జయంతి ఉంది. ఆ వేళనే ముహూర్తంగా తీసుకుని ఆయన జనంలోకి రావచ్చు అన్న చర్చ అయితే ఉంది.;

Update: 2025-04-05 02:30 GMT
ఆ రోజు నుంచి  జనంలోకి జగన్ ?

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి ఎపుడు వస్తారు అన్నది ఒక చర్చగా ఉంది. జగన్ అయితే ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చి తమ పార్టీ చేత ఆందోళనలు మొదలుపెట్టించారు ఇక తాను కూడా డిసెంబర్ నుంచి జనంలోకి వస్తాను అని ఆయన పార్టీ వారితో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత అది కాస్తా సంక్రాంతి దాకా వెళ్ళింది.

మరో వైపు చూస్తే ఫిబ్రవరి నుంచి అని కూడా అన్నారు. అలా ఉగాది కూడా ఒక ముహూర్తం అయింది. ఇపుడు చూస్తే ఆ డేటూ అయిపోయింది. అయితే తాడేపల్లిలో తాజాగా పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించిన వారి కోసం ఒక సమావేశం నిర్వహించి వారందరికీ హాట్సాఫ్ అని జగన్ చెప్పారు.

మిమ్మల్ని మీ సేవలను గుర్తు పెట్టుకుంటాను. మరోసారి మన ప్రభుత్వం వచ్చినపుడు కచ్చితంగా 2.0 ఏమిటో చూపిస్తాను అని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తాను జనంలోకి వస్తాను అని జగన్ మరోసారి చెప్పినట్లుగా ప్రచారం సాగింది ఇదిలా ఉంటే జగన్ ఎపుడు జనంలోకి వస్తారు అన్నది చర్చగానే ఉంది.

మామూలుగా చూస్తే కనుక ఇపుడు ఎండాకాలం మొదలైంది. ధాటీగా ఎండలు ఉన్నాయి. దాంతో పాటు మరో రెండు నెలలలో కూటమి ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తి అవుతుంది. ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ లో కొన్ని కీలక హామీలను మే జూన్ నెలలలో నెరవేరుస్తాను అని ప్రకటించి ఉంది.

దాంతో అవన్నీ చూసుకుని జనం వద్దకు వెళ్ళేటపుడు సరిపడా రాజకీయ సరుకుతోనే రావాలని జగన్ వ్యూహంతో ఉన్నారని అంటున్నారు ఇలా కనుక అన్నీ చూసుకుంటే జూలై 8న వైఎస్సార్ జయంతి ఉంది. ఆ వేళనే ముహూర్తంగా తీసుకుని ఆయన జనంలోకి రావచ్చు అన్న చర్చ అయితే ఉంది. ఒక విధంగా వైసీపీకి వైఎస్సార్ ఒక సెంటిమెంట్. దాంతో ఆయన పుట్టిన రోజునే పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడితే సూపర్ సక్సెస్ అవుతాయని కూడా అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఆనాటికి అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతుంది. ప్రభుత్వం పాలనా తీరు మీద ప్రజలు కూడా ఒక అంచనాకు వస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఇలా ఓటమి చెందగానే అలా జనంలోకి వచ్చామన్న విమర్శలు కూడా ఉండకుండా చాలా టైం ఇచ్చి మాత్రమే తాము ప్రజల వద్దకు వస్తున్నామన్నది కూడా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక జగన్ జనంలోకి వస్తే పార్టీ గాడిన పడుతుంది అని ఇప్పటికే నాయకులు అంటున్నారు.

అలా వైఎస్సార్ జయంతి నుంచి జగన్ జనంలోకి రావడం స్టార్ట్ అవుతుందని కార్యకర్తలతో పాటు ప్రజలను కూడా నేరుగా కలుసుకుంటూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఉండేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని అంటున్నారు. మరి దీని మీద జరుగుతున్న ప్రచారం విషయంలో వాస్తవాలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News