బాబుది కిచిడీ...ట్రాక్ రికార్డు అదే...!
టీడీపీ అధినేత చంద్రబాబు నోటికి వచ్చిన హామీలు వల్లె వేస్తున్నారు అని ముఖ్యమంత్రి వైఎ జగన్ విమర్శించారు
టీడీపీ అధినేత చంద్రబాబు నోటికి వచ్చిన హామీలు వల్లె వేస్తున్నారు అని ముఖ్యమంత్రి వైఎ జగన్ విమర్శించారు. ఎటూ హామీలను నెరవేర్చే ఉద్దేశ్యం లేదు కాబట్టే ఆయన దేశంలో అన్ని రాష్ట్రాల హామీలను తెచ్చి ఏపీలో జనం మీద కురిపిస్తున్నారు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బాబు కిచిడీ చేస్తున్నారు అని జగన్ సెటైర్లు వేశారు.
ఇటీవల దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఆ హామీలను అన్నీ చూసి జనాలు ఏ పార్టీని గెలిపించారో కూడా చూసుకుని చంద్రబాబు ఏపీలో వరాల వాన కురిపిస్తునారు అని జగన్ ఎద్దేవా చేశారు చంద్రబాబు తమ జీవితంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే చరిత్ర లేని వారు అని జగన్ విమర్శించారు.
చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ ఎంతో కూడా జగన్ లెక్కలేసి చూపించారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతోందని, వాటి కోసమే కిందా మీదా అవుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
డెబ్బై వేల కోట్లకే ఏపీ శ్రీలంక అవుతుందని నిన్నటి దాకా భయపెట్టిన చంద్రబాబు ఇపుడు అవే హామీలను రెట్టింపు అంటూ తాను ఇవ్వడానికి చూస్తున్నారు అని అన్నారు. బాబు ఇచ్చే హామీల విలువ లెక్క కడితే అక్షరాలా ఏడాదికి లక్షా 26 వేల కోట్ల రూపాయలు అవుతుందని జగన్ చెప్పారు. మరి అపుడు ఏపీ శ్రీలంక కన్నా ఏమి అవుతుందో బాబు అండ్ కో చెప్పాలని ఆయన అంటున్నారు.
చంద్రబాబు హామీల మీద ఆయనతో పాటు ఎల్లో మీడియా ఒక విషయం చెబుతోందని, బాబు సంపద సృష్టిస్తారు అని తెగ ప్రచారం చేసి ఊదరగొడుతునారని, అయితే బాబు ఇప్పటిదాకా పాలించిన మూడు సార్లు ముఖ్యమంత్రిత్వంలోనూ ప్రతీ ఏడాది లోటు బడ్జెట్ తోనే ప్రభుత్వ పాలన సాగిందని జగన్ విమర్శించారు.
ఉమ్మడి ఏపీలో కూడా లోటు బడ్జెట్ తో పాలన చేసిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. చంద్రబాబుది ఎపుడూ హామీలు ఇచ్చి ఎన్నికలు అయిన తరువాత మ్యానిఫేస్టోని బుట్టదాఖలు చేసే నైజం అని అన్నారు. చంద్రబాబు ఏమీ కొత్త నాయకుడు కాదని ఆయన మూడు సార్లు ఏపీకి సీఎం గా పనిచేసిన వారేనని అన్నారు. అలాంటి బాబు మళ్ళీ ఒక్క చాన్స్ అని ఎలా అడుగుతారు అని జగన్ ప్రశ్నించారు.
తాను ఏ హామీ ఇచ్చినా నెరవేరుస్తానని అందుకే ప్రజలలో విశ్వసనీయత ఉందని అన్నారు. తాను అయిదేళ్లలో కరోనా వచ్చినా కూడా ఏ ఒక్క పధకాన్ని ఆపలేదని జగన్ చెప్పుకొచ్చారు. ప్రజలు ఇవన్నీ బేరీజు వేసుకునే తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని, మరో మూడు నెలలలో పూర్తి స్థాయి బడ్జెట్ ని తాము ఇదే సభ నుంచి ప్రవేశపెడతామని కూడా జగన్ ధీమా వ్యక్తం చేశారు.