"అర్జునుడిపై బాణం పడింది అంతే.. కౌరవులు గెలిచినట్టుకాదు!"
ఈ క్రమంలో ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాగవరప్పాడులో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
ఏపీ సీఎం జగన్.. తనపై రాయి దాడి జరిగిన తర్వాత.. తొలిసారి చేసిన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''అర్జునుడిపై బాణం పడింది అంతే.. కౌరవులు గెలిచినట్టుకాదు!'' అని సీఎం అన్నారు. మహాభారత సంగ్రామంలో కౌరవులు.. దుష్టచతుష్ట యంతో కలిసి.. అర్జునుడిపై బాణాలు వేశారని చెప్పారు. అయితే.. కౌరవులు గెలిచారో.. అర్జునుడు గెలిచాడో.. అందరికీ తెలిసిందే నని చెప్పారు. అలానే వైసీపీ కూడా గెలవడం ఖాయమని చెప్పారు. శనివారం రాత్రి జరిగిన రాయి దాడి ఘటన తర్వాత.. ఆదివారం రెస్ట్ తీసుకున్న సీఎం జగన్.. సోమవారం మధ్యాహ్నం.. తన బస్సు యాత్రను కొనసాగించారు.
ఈ క్రమంలో ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాగవరప్పాడులో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఆసాంతం రాయిదాడి ఘటన గురించే ఆయన ప్రసంగించడం గమనార్హం. ''దేవుడు నా స్క్రిప్టును పెద్దగా రాశాడు. అందుకే.. ప్రాణాలు పోవాలని భావించిన దుష్ట చతుష్టయం పాచిక పారలేదు'' అని అన్నారు. అంతేకాదు.. ఇలాంటి రాళ్ల దాడులతో తన సంకల్పం చెదిరిపోతుందని ఎవరైనా భావిస్తే.. అది వారి భ్రమేనని తేల్చి చెప్పారు. తన సంకల్పం మరింత బల పడుతుందన్నారు. వారు(విపక్షాలు) దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు.
ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారంటే.. వైసీపీ గెలుస్తోందన్న సంకేతాలు తమ కంటే కూడా వారికే ఎక్కువగా బలపడుతున్నాయని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ''నాపై రాయి వేశారు. దీనికి అనేక వక్ర భాష్యాలు చెబుతున్నారు. కానీ, ఆ రాయి నా కంటికి పై భాగంలో తగిలింది కాబట్టి సరిపోయింది. అదే కంటిపై తగిలి ఉంటే,, కణతిపై తగిలి వుంటే బాగుంటేదని వారు కోరుకుని ఉండొచ్చు. కానీ, ఆ దేవుడు నా స్క్రిప్టు పెద్దగా రాశాడు. అందుకే అది వారు కోరుకున్న చోట తగలలేదు. ఇదే మనం గెలుస్తున్నామనడానికి పెద్ద సంకేతం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. మనదే గెలుపు'' అని సీఎం జగన్ నొక్కి చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న పేదలకు మంచి చేస్తుంటే.. కూటమి నాయకులు ఓర్చుకోలేక పోతున్నారని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. పేదలకు మంచి చేయాలన్న ఉద్దేశమే వారికి లేదన్నారు. అసలు ఆ ముసలాయన ఉద్దేశంలో పేదలు ఉన్నారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన ఫిలాసఫీ పేదలకు వ్యతిరేకమన్నారు. ''నేను ఒంటరినని.. నాపై ఇంత మంది కలిసి వస్తున్నారు. కానీ.. ఈ జగన్ ఒంటరి కాదు.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి కుంటుంబం.. ప్రతి అక్కచెల్లెమ్మా.. ఈ జగన్ వెంటే ఉంటుందన్న విషయం వారికి తెలియదు. అది జూన్ 4న తెలుస్తుంది'' అని జగన్ వ్యాఖ్యానించారు.