ఎన్నికల పై జగన్ సంచలన కామెంట్స్ !
మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ జగన్ చేసిన ఈ కామెంట్స్ రాజకీయంగా ప్రకంపనలు సృషిస్టున్నాయి.
ఏపీలో మరో వారం రోజులలో పోలింగ్ ఉంది. ఈ కీలక సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం అయితే తనకు లేదని సాక్షాత్తూ జగన్ చెప్పడం విశేషం. టీడీపీ కూటమి తన మీద కుట్రలు చేస్తోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ జగన్ చేసిన ఈ కామెంట్స్ రాజకీయంగా ప్రకంపనలు సృషిస్టున్నాయి.
గతంలో విపక్షాల నుంచి ఈ తరహా ఆరోపణలు కానీ ప్రకటనలు కానీ వచ్చేవి. కానీ ఇపుడు అధికారంలో ఉన్న జగన్ నోటి వెంట రావడంతో వైసీపీ లోనూ దీని మీద విస్తృతంగా చర్చ సాగుతోంది. అదే టైంలో అసలు ఏమి జరుగుతోంది అన్న డిస్కషన్ కూడా మొదలైంది.
ఏపీలో ఉన్నఫళంగా డీజీపీని మార్చడం కొత్త డీజీపీని నియామకం చేయడంతో వైసీపీ వర్గాలకు షాక్ తగిలింది అని అంటున్నారు. నిజానికి డీజీపీని ఈ దశలో మార్చరు అని అంతా అనుకున్నారు. కానీ అది జరిగిపోయింది. అదే టైం లో ఏపీలో కొనసాగుతున్న పధకాలకు కూడా నిధులు విడుదల చేయవద్దు అని ఈసీ ఆదేశాలు జారీ చేయడం మరో కీలకమైన పరిణామం గా ఉంది.
ప్రతీ ఏటా ఇస్తున్న పధకాలు వాటి కొనసాగింపు మీద ఈసీ ఆంక్షలు పెట్టడంతోనే జగన్ ఫైర్ అవుతున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన ఏకంగా సంచలన కామెంట్స్ చేశారు. కూటమి నేతలు తన మీద కుట్రలు చేస్తున్నారు అని జగన్ తీవ్ర ఆరోపణలే చేశారు. అమలులో ఉన్న పధకాలకు డబ్బులు ప్రజలకు చేరకుండా చేయడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇష్టానుసారంగా అధికారులను బదిలీలు చేస్తున్నారు అని అంటున్నారు. కీలకమైన కడప కర్నూలు, అనంతపురం ఇలా అనేక చోట్ల ఎస్పీలు ఉన్నతాధికారుల బదిలీలు వరసబెట్టి జరుగుతున్నాయి. పేదలకు మంచి చేస్తున్న తనను లేకుండా చేయాలనే ఇదంతా అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
మరో వైపు చూస్తే ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణ చేయడం కూడా చర్చనీయాంశం అయింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిధుల విడుదలకు ఈసీ నో చెప్పడంతో ఇపుడు దాని మీదనే వైసీపీ అధినాయకత్వం నిరసన వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు. తుపాను కరవు కారణంగా నష్టపోయిన రైతులకు ఇంపుట్ సబ్సిడీ ఇస్తామని అలాగే విద్యా దీవెన కింద 610 కోట్ల రూపాయలను ఫీజ్ రీ యింబర్స్ మెంట్ కింద ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోసం కోరింది. దానికి ఈసీ నో చెబుతూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ అధినాయకత్వంలో ఈ రకమైన స్పందన వచ్చిందని అంతున్నారు.
అదే సమయంలో తెలంగాణాలో అకాల వర్షాల్కు దెబ్బ తిన్న పంటలకు అక్కడ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చందుకు ఈసీ అనుమతి ఇవ్వడం విశేషం అంటున్నారు. దీని కంటే ముందు చూస్తే 2019 ఎన్నికల వేళకు ముందు రోజు వరకూ పసుపు కుంకుమ కింద నగదు పంపిణీ చేయడానికి నాడు ఈసీ అనుమతించిందని కూడా గుర్తు చేస్తున్నారు.
ఇక ఆన్ గోయింగ్ స్కీమ్స్ విషయంలో ఎపుడూ ఈసీ ఆటంకం పెట్టదు, కానీ ఇపుడు ఏపీ ప్రతిపాదనల పట్ల ఇలా చేయడమేంటి అన్న ఆవేదనతోనే ముఖ్యమంత్రి జగన్ ఈసారి ఎన్నికలు సజావుగా సాగవు అన్న డౌట్ ని వ్యక్తం చేశారు అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో రాజకీయం ఎలా మారుతుందో.