"టీడీపీ నాయకులు గడప గడపకూ వెళ్లగలరా"? జగన్ కీలక వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా ఎన్నికల వేళ బాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు.

Update: 2024-08-07 12:09 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి చిన్నపాటి ఎన్నికల సందడి నెలకొంది. అయితే... ఇది కచ్చితంగా తాజా రాజకీయాల్లో కీలకమైన విషయంగానే ఉంది. ప్రధానంగా మెజారిటీ లేకపోయినా టీడీపీ పోటీకి దిగిందని వైసీపీ నేతలు చెబుతున్న వేళ జగన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా విలువలు, విశ్వసనీయతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ బాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు.

అవును... తాజాగా విశాఖ జిల్లాలో వైసీపీ తరుపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపులు జరుగుతాయనే చర్చ జరుగుతున్న వేళ... విలువలు, విశ్వసనీయత అనేవి అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ చాలా ముఖ్యమని తెలిపారు.

ఈ సందర్భంగా... రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా గౌరవించరని చెప్పిన జగన్... 2014, 2019, 2024 ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా 2014 ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇవ్వాలని తనతో చాలా మంది చెప్పారని, అయితే అందుకు తాను అంగీకరించలేదని, అందుకే ఆ ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని.. ఫలితంగా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఆ సమయంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ అమలుచేసినట్లు చెప్పిన జగన్... 2024 ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి తప్పుడు హామీలు ఇచ్చారని అయితే... 10శాతం మంది ప్రజలు ఆ హామీలను నమ్మారని, నమ్మి మోసపోయారని అన్నారు.

2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినందుకే మనం వైసీపీ నేతలు ప్రజల వద్దకు గర్వంగా వెళ్లగలరని.. చంద్రబాబు చెందిన నేతలకు.. వైసీపీ నేతల్లా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయా అని జగన్ ప్రశ్నించారు. అలా వెళ్లిన టీడీపీ నేతలను ప్రజలు సూపర్ సిక్స్ గురించి అడిగితే ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. వైసీపీకి టీడీపీకి ఉన్న తేడా అదని జగన్ స్పష్టం చేశారు.

ఈ సమయంలోనే పలావు, బిర్యానీ పోలీకలు తెరపైకి తెచ్చారు జగన్. ఇందులో భాగంగా జగన్ పలావు పెట్టాడు,చంద్రబాబు బిర్యానీ పెడతాడని అన్నారని చెప్పిన జగన్... ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ అంతకన్నాలేదని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా బొత్సను గెలిపించాలని, బొత్స గెలుపుకు అంతా అండగా ఉండాలని జగన్ తన పార్టీ తరుపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులను కోరారు!

Tags:    

Similar News