Begin typing your search above and press return to search.

జగన్ ఎంత పెద్ద బాంబు పేల్చారు ?

అంతే కాదు విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆయన చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు.

By:  Tupaki Desk   |   26 April 2024 6:30 AM GMT
జగన్ ఎంత పెద్ద బాంబు పేల్చారు ?
X

రాజకీయ హడావుడిలో పడి ఈ వార్త మీడియాలో హైలెట్ కాలేదా లేక టీడీపీ కూటమి కావాలనే దీనిని సైడ్ చేసిందా తెలియలేదు కానీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అతి పెద్ద బాంబునే పేల్చారు అని అంటున్నారు . అంతే కాదు రాజకీయ సంచలనానికే తెర లేపారు ఇదంతా ఉత్తరాంధ్రాలో జరిగింది. విశాఖలో ఒక రోజు విడిది చేసిన జగన్ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకుల భేటీలో అన్న మాటలు యాధృచ్చికం అయితే కావు, కాకతాళీయం అంతకంటే కావు. ఎందుకంటే జగన్ ఎపుడూ అలా మాటను తేలికగా నోట జారనివ్వరు అని అంటారు.

అంతే కాదు విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆయన చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. అలాంటిది జగన్ ఎన్నికల తరువాత జరిగే పరిణామాలు అదే విధంగా కేంద్రంలోని ఎన్డీయేతో వైసీపీ రాజకీయ బంధాలు బాంధవ్యాల మీద ఒక్క మాటతో తేల్చేశారు. అంతా ఉక్కు కార్మికుల ఇష్యూనే చూసారు. దాని మీదనే జగన్ హామీ ఇచ్చారు అనుకున్నారు. కానీ జగన్ ఆ హామీ వెనక మాటల వెనక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అది కూడా ఎన్డీయేతో వైసీపీది చెప్పకనే చెప్పారని అంటున్నారు.

వాస్తవానికి ఇది ఏపీలో మంట పెట్టాలి. రాజకీయంగా రచ్చ జరగాలి. కానీ అన్నీ తెలిసే టీడీపీ కూటమి దీన్ని కావాలని సైడ్ ఇష్యూ చేసింది అంటున్నారు. ఎన్డీయేతో వైసీపీ అంటే వారికే ఇబ్బంది అని ఆ విధమైన విమర్శలు కూడా చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎందుకు ఈ మాట అన్నారు. ఆయన మనసులో ఆలోచనలు ఏమిటి అన్న దాని మీద చర్చ సాగుతోంది.

కేంద్రంలో ప్రభుత్వ స్థాపనకు బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే నేను మద్దతు ఇస్తాను అని జగన్ అన్నాడు అని ఒక బాంబు లాంటి వార్త ప్రచారం జరుగుతుంది . నిజానికి ప్రస్తుతం ఎన్నికల ప్రచార పర్వం సాగుతోంది. బీజేపీ టీడీపీ కూటమిలో ఉంది. ఏపీలో ఎన్డీయే అంటే వారి వైపే చూస్తారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోతే టీడీపీ సపోర్ట్ చేస్తుంది. బయట నుంచి వైసీపీ చేయడం ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది.

మరో వైపు చూస్తే టీడీపీ ఉన్న కూటమిలో వైసీపీ ఉండకూడదు. చంద్రబాబు జగన్ ల మధ్య రాజకీయ వైరం ఉంది ఇద్దరూ ప్రత్యర్థులుగా ఏపీలో ఉంటున్నారు. అటువంటిది టీడీపీ ఉన్న కూటమికి మద్దతు ఇస్తామని చెప్పడం జగన్ కి ఏ విధంగా కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి చూస్తే జగన్ ఫ్రీ బర్డ్. ఆయన పార్టీ ఎన్నికల తరువాత వచ్చే ఫలితాలను అనుసరించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.

ఆయన దేశంలో ఉన్న రెండు పెద్ద జాతీయ కూటములు అయిన ఎన్డీయేలో లేరు. ఇండియా కూటమిలోనూ లేరు. అలాంటపుడు ఈ అడ్వాంటేజ్ ని ఆయన వాడుకోకుండా ముందే ఎందుకు ఈ రకంగా ప్రకటించారు అన్నది ప్రశ్న. అంతే కాదు బీజేపీ చేరిన తరువాత టీడీపీ కూటమి ఇబ్బంది పడుతోంది. ఏపీలో మైనారిటీలు కూడా గుర్రుగా ఉన్నారు. బీజేపీ రాజకీయ సిద్ధాంతాలు బలహీన వర్గాలకు మైనారిటీలకు ఇబ్బందిగా ఉన్నాయి అని అంటున్నారు.

దాంతో ఆ నెగిటివిటీ ఏమైనా ఉంటుందా అని టీడీపీ తర్జన భర్జన పడుతోంది. ఇపుడు కోరి మరీ తగిలించుకోవడం వైసీపీకి అవసరమా అన్న చర్చ మొదలైంది అయితే జగన్ ఎందుకు ఈ ప్రకటన చేశారు అంటే బీజేపీని మంచి చేసుకోవడానికే అని అంటున్నారు. జగన్ మీద కేసులు ఉన్నాయి. అవి దశాబ్దాలుగా సాగుతున్నా ఎన్నికల తరువాత అవి తొందరలోనే కొలిక్కి రావచ్చు అని అంటున్నారు.

దాంతోనే బీజేపీ వైపు ఆయన మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన న్యూట్రల్ విధానం నుంచి బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం అంటున్నారు. ఇక బీజేపీకి మద్దతు తక్కువ అయితే తాను సపోర్ట్ చేస్తాను అలా ఏపీ సమస్యలు పరిష్కారం అయ్యేలా వత్తిడి తెస్తాను అంటున్నారు. అయితే బీజేపీకి లోక్ సభలో మెజారిటీ ఉన్నా రాజ్యసభలో ఎపుడూ లేదు. కానీ రాజ్యసభలో కూడా బీజేపీ బిల్లులకు అడగకుండానే మద్దతు ఇచ్చిన ఘనత వైసీపీది అన్న విమర్శలు ఉన్నాయి.

రాజ్యసభలో పట్టుబట్టి ఉంటే ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా వంటి వాటికి పరిష్కారం దొరికేది కదా అన్న మాట కూడా ఉంది. రాజ్యసభలో ఇపుడు వైసీపీకి మొత్తం 11 మంది ఎంపీలు ఉన్నారు.వీరి మద్దతు కూడా బీజేపీకే అని చెప్పకనే చెబుతున్నారు. రేపటి రోజున వైసీపీ నుంచి గెలిచే లోక్ సభ సభ్యుల మద్దతు కూడా ఎన్డీయేకే అని ఆయన అంటున్నారు.

అయితే ఇక్కడ జగన్ లాజిక్ ని మిస్ అయ్యారా అన్న చర్చ కూడా వస్తోంది. ఎన్నికల తరువాత బీజేపీకే తన మద్దతు అని అంటే ఏపీలో ఎన్డీయే కూటమికే జనాలు ఓట్లు వేస్తారు కానీ వైసీపీకి ఎందుకు వేయాలి. పైగా మైనారిటీలు కూడా రివర్స్ అయితే అపుడు అసలైన ఇబ్బంది వస్తుంది కదా అన్న చర్చ ఉంది.

అయితే వీటన్నిటి కంటే కూడా మరో ముఖ్యమైన విషయమే ఎన్నికల ముందు ఇలా జగన్ చేత ఈ ప్రకటన చేయించేందుకు కారణం అయిందని అంటున్నారు. ఎన్నికల ప్రచారం మధ్యలోనే కేంద్ర బీజేపీ నాయకత్వం కేసుల విషయంలో ఇబ్బంది పెడుతుందని ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది. దాంతో దాన్ని తట్టుకోవడానికి ఈ విధంగా బాంబు పేల్చారు అని అంటున్నారు.చూడాలి మరి ఈ ప్రచారం వైసీపీకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది.