అమరావతిపై జగన్ అసలు గేమ్ ప్లాన్ ఏంటి..?
అయితే, వాస్తవానికి జగన్ ఉద్దేశం వేరు. ఇది ఆయన అసెంబ్లీలోనే చెప్పారు. అయితే ఆ తర్వాత ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.
అమరావతి విషయంలో జగన్ ఉద్దేశం ఏంటి? రాజధాని అమరావతిని పక్కన పెట్టిన జగన్ అసలు రాజధాని లేకుండా చేయాలి అనుకున్నారా? లేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఆయన అభివృద్ధి పథంలో నడిపించాలని భావించారా? ఈ విషయాల్లో అధికారంలో ఉన్నప్పుడు వైసిపి క్లారిటీ ఇవ్వలేకపోయింది. రాజధానిపై ఒక కులం ముద్రను ఆపాదించడం, ధనిక నగరంగా దాన్ని పేర్కొనడం, అక్రమాలు జరిగాయని చెప్పడం వరకే పరిమితమై ప్రజల్లో `జగన్ అమరావతిని వ్యతిరేకిస్తున్నారు` అనే బలమైన ముద్రను తెచ్చుకుంది.
అయితే, వాస్తవానికి జగన్ ఉద్దేశం వేరు. ఇది ఆయన అసెంబ్లీలోనే చెప్పారు. అయితే ఆ తర్వాత ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం మొదలైంది హైదరాబాద్ కోసం. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం వంటి కొన్ని జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలన్నీ వెనకబడి ఉన్నాయి. మిగిలిన జిల్లాల కోసం ఉద్యమం జరగలేదు. హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం తెరమీదకు వచ్చింది. దీని కారణం హైదరాబాద్ అన్ని విధాల డెవలప్ అయి ఉండడం.
ఆర్థికంగా హైదరాబాద్ నగరం పెట్టుబడికి అనుకూలంగా ఉండడం. అదేవిధంగా హైదరాబాద్ దేశంలోనే ఒక గమ్యస్థానంగా మారడం. ఐటీ రంగానికి కేంద్రంగా మారడం. వంటివి కారణాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అదే విధంగా అమరావతిని డెవలప్ చేస్తారని చంద్రబాబు చెప్తున్నారు. నవ నగరాలు అని చెబుతున్నా ఈ నగరాలు కూడా అమరావతిలోనే ఉంటాయి. అంటే కేవలం గుంటూరు-విజయవాడ చుట్టుపక్కల ఉన్న 100 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అమరావతి ప్రభావం కనిపిస్తుంది.
తద్వారా మిగిలిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు అన్యాయం చేసినట్టు అవుతుందనేది వైసిపి వాదన. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కట్టిన పన్నులతో అమరావతిని అభివృద్ధి చేస్తారు. తద్వారా ఒక ప్రాంతం అయితే అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇందులో సందేహం లేదు. అమరావతి దేశానికి తలమానికంగా ఉంటుంది. కానీ, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇది జగన్ చేసిన ఆలోచన. కానీ ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో విఫలమయ్యారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి అనుకున్న జగన్ విశాఖను రాజధానిగా చేసుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ చేయడం కోసమే మేము రాజధాని ఏర్పాటు చేసుకున్నామని చెప్పలేకపోయారు. కేవలం విశాఖలో నది తీరం ఉందని విశాఖ ఇప్పటికే డెవలప్ అయిందని అందుకే మేము రాజధాని పెడుతున్నాము అని చెప్పుకొచ్చారు. ఇక కర్నూలు న్యాయ రాజధాని చేయాలనుకున్నారు. కానీ తద్వారా సీమలో ఉన్న నాలుగు జిల్లాలను డెవలప్ చేయాలను కుంటున్నామని, కారిడార్ నిర్మించాలనుకుంటున్నామని విషయాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లలేక పోయారు.
అమరావతిని శాసనసభ రాజధానిగా లెజిస్లేచర్ క్యాపిటల్గా మాత్రమే చూడాలని ఆయన భావించారు. కానీ ఈ విషయాన్ని కూడా ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నంలో విఫలమయ్యారు. నిజానికి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో రేపు అమరావతిని కూడా అలాగే డెవలప్ చేస్తే రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమం మరోసారి వస్తుంది. ఈరోజు కాకపోతే 20 సంవత్సరాల తర్వాత అయినా ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమం వస్తుందనేది జగన్ వాదన.
ఇందులో నిజం ఉంది. కానీ ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారు. అదే విధంగా తన మీదకు వచ్చిన ఆరోపణలను ఖండించలేకపోయారు. వైసిపి వాదనను కూడా వినిపించలేకపోయారు. తద్వారా అమరావతి విషయంలో జగన్ ఉద్దేశం ఎలా ఉన్నా ఆయన విఫలమయ్యారని మాత్రం చెప్పడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో వైసిపి నాయకులు ప్రస్తావించారు. కానీ సంఖ్యాబలం లేని కారణంగా వారికి మైకు అందని పరిస్థితి ఏర్పడడం గమనార్హం. అయితే.. అమరావతిని ప్రాతిపదికగా తీసుకున్న చంద్రబాబు కూడా.. ఆయా విషయాలను గమనించి.. ముందుకు అడుగులు వేయాలి. ఇతర ప్రాంతాలు దెబ్బతినకుండా ముందుకు సాగాలి.