కీలక నియోజకవర్గంలో జగన్‌ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?

ఈ నేపథ్యంలో బందరు ఎంపీ బరిలో వైసీపీకి గట్టి అభ్యర్థులు లేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా ఈ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని జగన్‌ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.

Update: 2024-01-16 14:30 GMT

కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గం.. మచిలీపట్నం (బందరు). టీడీపీ, వైసీపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. 2009, 2014 ఎన్నికల్లో బందరు ఎంపీగా టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బందరు ఎంపీగా వైసీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కొనకళ్ల నారాయణ ఓటమి పాలయ్యారు.

కాగా ప్రస్తుతం బందరు ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కీలకమైన బందరు లోక్‌ సభా నియోజకవర్గంలో వైసీపీ గట్టి అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడింది.

వాస్తవానికి పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారధిని బందరు ఎంపీగా బరిలోకి దించాలని జగన్‌ అనుకున్నారు. అయితే పార్థసారధి తాను పోటీ చేస్తే పెనమలూరు నుంచే పోటీ చేస్తానని.. బందరు ఎంపీగా పోటీ చేయబోనని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఒకటి, రెండు రోజుల్లో టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బందరు ఎంపీ బరిలో వైసీపీకి గట్టి అభ్యర్థులు లేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా ఈ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని జగన్‌ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గుంటూరు ఎంపీ స్థానాన్ని ముస్లింలకు ఇవ్వలేకపోతుండటంతో బందరు ఎంపీ స్థానాన్ని వారికి ఇవ్వాలని నిర్ణయించారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కుటుంబానికి సన్నిహితుడు అయిన ఆయూబ్‌ ఖాన్‌ ను బందరు ఎంపీగా నిలబెట్టడానికి జగన్‌ నిర్ణయించారని సమాచారం. ఇందుకు తగ్గట్టే ఆయూబ్‌ ఖాన్‌ జగన్‌ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయూబ్‌ ఖాన్‌ ప్రస్తుతం కృష్ణా జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ కు ఆప్తుడని చెబుతున్నారు. అలాగే జగన్‌ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. జగన్‌ కు రాజకీయంగా ప్రియశిష్యుడని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో బందరు ఎంపీగా గట్టి అభ్యర్థి దొరక్కపోతే ఆయూబ్‌ ఖాన్‌ ను వైసీపీ అభ్యర్థిగా బరిలో దించుతారని సమాచారం. అయితే కాపులు, గౌడలు అత్యధికంగా ఉన్న బందరు లోక్‌ సభా నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి విజయం, సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జగన్‌ కొత్త ప్రయోగం ఫలిస్తుందో, లేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News