గీతాంజలి ఆత్మహత్య కేసు... వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
తెనాలి మహిళ గీతాంజలి (29) ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే
తెనాలి మహిళ గీతాంజలి (29) ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో తమకు అమ్మఒడి, ఇంటిపట్టా లభించాయని ఆమె సంతోషంగా చెప్పిన వీడియో వైరల్ అవ్వడంతో.. టీడీపీ, జనసేనలకు చెందిన సోషల్ మీడియా జనాలు విపరీతంగా ట్రోల్ చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ ఎంటరయ్యారు.
అవును... గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం.. అందుకు టీడీపీ, జనసేనలకు చెందిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వల్గర్ గా ఆమెను ట్రోలింగ్ చేశారని.. అవి భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
ఈ సందర్భంగా గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఆయన... ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా... ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ చట్టం వదిలిపెట్టదని జగన్ స్పష్టం చేశారు.
కాగా ఈ నెల 4న జరిగిన ఒక కార్యక్రమంలో “జగనన్న గృహనిర్మాణ పథకం” కింద ఇంటిస్థలం పొందడంతో వైసీపీ ప్రభుత్వాన్ని గీతాంజలి ప్రశంసించిన సంగతి తెలిసిందే. తనపేరు మీదే ఇంటిపట్టా వచ్చిందని.. తనకు చాలా సంతోషంగా ఉందని.. ఇప్పటికే తన పిల్లలకు “అమ్మఒడి” కూడా వస్తుందని ఆమె సంతోషంగా పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
దీంతో ఆమెను నెట్టింట ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రాయలేని స్థాయిలో ఆమెపై దుర్భాషలాడుతూ, ఆమె క్యారెక్టర్ ని కించపరుస్తూ, ఆమెను పేటీఎం బ్యాచ్ అని విమర్శిస్తూ తీవ్రంగా ట్రోల్స్ చేశారు! దీంతో ఆ వేదింపులు భరించ లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. ఆమె శవ పంచనామాలో ఇదే విషయాన్ని రైల్వే పోలీసులు పొందుపరిచారని తెలుస్తుంది. దీంతో... ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సమాచారం!