పిన్నెల్లి కోసం జైలుకి జగన్... నెక్స్ట్ ప్రోగ్రాం ఇదే!

ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్టైన పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

Update: 2024-07-03 12:07 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో కాస్త మౌనంగా కనిపించిన మాజీ ముఖ్యమంత్రి... స్వల్ప విరామం అనంతరం యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన దాడుల్లో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలను త్వరలో కలుస్తారని చెబుతున్న వేళ.. అంతకంటే ముందు ఒకసారి నెల్లూరు జైలుకు వెళ్లిరావాలని నిర్ణయించుకున్నారు.

అవును... వైఎస్ జగన్ ఈ నెల 4 (గురువారం) నెల్లూరు జైలుకు వెళ్లిరానున్నారు. ఇందులో భాగంగా ఆ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం, టీడీపీ ఏజెంటు పై దాడి, మహిళపై దుర్భాషలు, కారంపూడి సీఐపై హత్యాయత్నం వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్టైన పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి పిన్నెల్లిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు జగన్ నెల్లూరు జైలుకు వెళ్లి.. పిన్నెల్లిని పరామర్శించనున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ పర్యటనలో భాగంగా జగన్ 4వ తేదీ ఉదయం 9:40 గంటలకు హెలీకాప్టర్ లో నెల్లూరుకు వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్తారు. పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం జగన్ స్థానిక నేతలతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో... వచ్చే వారం నుంచి పార్టీ కీలక సమావేశాల కార్యచరణ ప్రకటించనున్నారని అంటున్నారు.

Read more!

కాగా... 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. 2024 ఎన్నికల్లో మాత్రం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో తొలి నుంచీ వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో భవిష్యత్ కార్యచరణపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని.. అనంతరం జనాల్లోకి వెళ్లాలని, ప్రజల తరుపున పోరాడాలని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక దశాబ్ధాలుగా వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి బలంగా ప్రయాణించారు. అనంతరం జగన్ కూ వీర విధేయుడిగానే ఉంటూ వచ్చారు. మాచర్లలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బలమైన నేతగా మారిన ఆయన.. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి చేతిలో ఓటమిపాలయ్యారు.

Tags:    

Similar News

eac