జగన్ తో ముద్రగడ : గోదావరి పాలిటిక్స్ లో నెక్స్ట్ స్టెప్ ?

రానున్న కాలమంతా పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి పదును పెట్టనున్నారు.

Update: 2024-07-05 17:11 GMT

ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మూడు రోజుల అధికారిక పర్యటన పూర్తి చేసుకుని వెళ్లారు. తాను పిఠాపురం వాసిని అని ఈసారి ఆయన గట్టిగా చెప్పారు. దాదాపుగా మూడున్నర ఎకరాల భూమిని పవన్ పిఠాపురంలో కొనుగోలు చేసారు.

అక్కడే ఇల్లూ క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేయబోతున్నారు. అందరికీ అందుబాటులో ఉండబోతున్నారు. రానున్న కాలమంతా పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి పదును పెట్టనున్నారు. పిఠాపురం పవన్ కి ఇపుడు సొంత నియోజకవర్గం. ఆయన రాజకీయాల్లో ఉన్నంతవరకూ అదే ఆయన పోటీ చేసే సీటుగా ఉండబోతోంది అని అంటున్నారు.

గోదావరి జిల్లాలలో పవన్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని తాజా ఎన్నికలు నిరూపించాయి. ఇపుడు ఆయన అధికారంలో కూడా ఉన్నారు. దాంతో జనసేనను మరింత పటిష్టం చేయడం ద్వారా గోదావరి జిల్లాలలో గట్టి పట్టుని సాధించే ప్రయత్నం చేస్తారు.

ఈ నేపధ్యంలో పొత్తులో ఉన్న టీడీపీకి కూడా ఇది లాభదాయకమే. ఈ రెండు పార్టీలు కలసి ఉంటే గోదావరి జిల్లాలలో వైసీపీకి ఎదురీతే అన్న చర్చ కూడా ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జగన్ తో భేటీ కావడం చర్చనీయాంశం అయింది. వైసీపీ ఓడిన తరువాత ముద్రగడ జగన్ ని కలవలేదు. పైగా ఆ మధ్యన ఆయన ఒక లేఖ విడుదల చేస్తూ తాను అనాధను అని చెప్పారు.

అంటే వైసీపీతో ఆయన రాజకీయ బంధాలు తెంపుకున్నట్లేనా అన్న చర్చ నడచింది. అయితే గోదావరి జిల్లాలలో వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే కాపుల బలం కూడగట్టడం అవసరం. దాంతో ముద్రగడని వైసీపీ వదులుకోదని అంటున్నారు. ఆయన సైతం వైసీపీ ఆఫీసుకు వచ్చి జగన్ తో భేటీ అయ్యారు.తన వెంట వచ్చిన నాయకులను జగన్ కి పరిచయం చేశారు. ఈ మీటింగ్ పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది అని అంటున్నారు.

ముద్రగడ జగన్ తాజా ఎన్నికల ఫలితాలతో పాటు గోదావరి జిల్లాల రాజకీయం ఏపీ రాజకీయ పరిణామాల మీద చర్చించారు అని అంటున్నారు. రానున్న రోజులలో జగన్ గోదావరి జిల్లాల పర్యటన కూడా పెట్టుకుంటారు అని అంటున్నారు. పార్టీ క్యాడర్ కి అండగా ఉంటామని చెప్పేందుకే ఈ కార్యక్రమాలని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ముద్రగడ కలసి వెళ్లారని అంటున్నారు. పవన్ కి ఎదురు నిలబడేందుకే ముద్రగడ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఎపుడూ రాజకీయాలు సామాజిక పరిస్థితులూ ఒకేలా ఉండవని అందువల్ల రేపటి రోజుల మీద ఆశతో వైసీపీ ఉంటే ముద్రగడ కూడా అదే ధీమాతో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే కాపులకు పవన్ రూపంలో కొత్త నాయకుడు లభించారు. ఆయన అయిదేళ్ళ పాలన సంతృప్తికరంగా ఉంటే ఆయన వెంటే కొనసాగుతారు. అయితే కాపుల మద్దతు కోసం వైసీపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడను అట్టిపెట్టుకొని వైసీపీ రానున్న రోజులలో రాజకీయంగా సాగాలని చూస్తోంది అని తెలుస్తోంది.

Tags:    

Similar News