విధేయ‌త‌కు వీర‌తాడు.. చెవిరెడ్డికి జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వి ..!

వైసీపీకి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ ఎదురు దెబ్బ‌తగిలిన విష‌యం తెలిసిందే.

Update: 2024-08-24 05:32 GMT

వైసీపీకి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ ఎదురు దెబ్బ‌తగిలిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించారు. అంతేకాదు.. ఆయ‌న‌కు ఏకంగా పార్టీ అనుబంధ విభాగాల (25 విభాగాలు) పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

వైసీపీ హ‌యాంలో ప్రభుత్వ విప్ గా, పార్టీలో అనుబంధ విభాగాలకు అధ్యక్షుడుగా పనిచేసిన చెవిరెడ్డికి ప్రతిపక్షంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న విషయాలలో అపారమైన అనుభవం ఉందనేది జ‌గ‌న్ భావ‌న‌. అంతేకాక పార్టీ అధినేత జగన్ ఏ పని అప్పగించినా సరే విజయవంతంగా పూర్తి చేయడం చెవిరెడ్డికి తెలిసిన ప్ర‌ధాన విద్య‌. త‌న గురించి కాకుండా.. జ‌గ‌న్ కుటుంబం గురించి ఆలోచించే నాయ‌కుడిగా.. కూడా పేరు తెచ్చుకున్నారు.

ఒకానొక ద‌శ‌లో మంత్రి ప‌ద‌విని కూడా ఆశించ‌కుండా... ఆయ‌న ప‌నిచేశారు. అంతేకాదు.. ఎంతో మంది పోటీలో ఉన్నార‌ని.. త‌న‌కు లేక‌పోయినా ఫ‌ర్వాలేద‌ని చెప్పే చెవిరెడ్డి అంతే విన‌యంతో జ‌గ‌న్‌కు చేరు వ‌య్యారు. ఇంట్లో మ‌నిషిగా క‌లిసిపోవ‌డం.. జ‌గ‌న్ ఆలోచ‌న‌ల మేర‌కు ప‌నిచేయ‌డం చెవిరెడ్డి స్పెషాలిటీ. అంతేకాదు.. పార్టీలో వివాదాల‌కు తావులేకుండా ప‌నిచేయ‌డంతోపాటు.. త‌న‌కు న‌చ్చినట్టు కాకుండా.. అధినేత మెచ్చిన‌ట్టు ప‌నిచేయ‌డం కూడా ఆయ‌న‌కు సొంతం.

ఈ క్ర‌మంలోనే అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డికి అప్పగించినట్లు సమాచారం. పార్టీ అధినేత వైఎస్ జగన్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని చెవిరెడ్డి త‌న వారితో చెప్పుకొచ్చారు. నిజానికి పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. ఇంత కీల‌క ప‌ద‌వి చెవిరెడ్డికి ద‌క్కుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇదిలావుంటే.. చెవిరెడ్డి సాధార‌ణంగా మాస్ నాయ‌కుడిగా క‌నిపించినా.. అన‌ర్గ‌ళంగా ఇంగ్లీష్ మాట్లాడ‌డంతోపాటు.. లా చ‌దివిన విష‌యం, హైకోర్టులో కొన్నాల్లు ప్రాక్టీస్ చేసిన విష‌యం చాలా మందికి తెలియ‌దు.

Tags:    

Similar News