జగన్ మూడు రాజధానులలోనూ ఓడిపోయారు !

దాంతో 151 సీట్ల మధ్యలో 5 కాస్తా జంప్ చేసి 11 దగ్గర నంబర్ సెటిల్ అయింది.

Update: 2024-06-07 12:30 GMT

అవును జగన్ మూడు రాజధానుల రాగం జనాలకు నచ్చలేదు. వారు ఆరునొక్కటి శృతి చేసి మరీ వైసీపీ చేత కూని రాగమే పలికించారు. దాంతో 151 సీట్ల మధ్యలో 5 కాస్తా జంప్ చేసి 11 దగ్గర నంబర్ సెటిల్ అయింది.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ ఓటమి మీద విశ్లేషణ చేస్తున్న వారికి తవ్విన కొద్దీ టన్నుల కొద్దీ నిజాలు అలా బయటకు వస్తున్నాయి. ఇది కదా విషయం ఇది కదా పొరపాటు అనుకుంటూ పోతే ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అలాంటిదే ఒకటి మూడు రాజధానుల వ్యవహారం.

వైసీపీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చింది. జగన్ స్వయంగా నాడు విపక్షంలో నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇక ఎన్నికల ప్రచారం వేళ అమరావతి రాజధాని అక్కడే ఉంటుందని చెప్పి తాను తాడేపల్లిలో కట్టుకున్న ఇంటిని కూడా సాక్ష్యంగా చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక అమరావతి మీద తొలి ఆరు నెలలూ ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉండి 2019 చివరిలో మాత్రం మూడు రాజధానులు అని పెద్ద బాంబు పేల్చారు.

అసలు ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఏమిటీ ఏపీలో అమలు అవుతుందా విభజన తరువాత చిన్న రాష్ట్రం అయిన ఏపీకి మూడు అవసరమా ఒకటి కట్టుకుంటే చాలదా అని ఎన్నో రకాలైన చర్చలు సాగాయి. ఇక 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రాజధాని రైతులు పరిస్థితి ఏమిటి అన్నది కూడా మరో చర్చ సాగింది.

ఇంకో వైపు విశాఖకు రాజధానిని తరలించాలని ఆలోచన. కర్నూల్ కి న్యాయ రాజధాని అని మరో ప్రకటన. ఇలా ఏవీ సాకారం కాక ఆదరాబాదరాగా అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఆమోదం పొందినా న్యాయ సమీక్షకు నిలవక మళ్ళీ అదే అసెంబ్లీలో రద్దు చేసుకోవడం ఇలాంటి చాలా చిత్రాలతో మూడు రాజధానుల కధ సాగింది.

మాకు రాజధాని కావాలి అని అంటున్న అమరావతి జనం గోడు పట్టించుకోకుండా మాకు వద్దు బాబోయ్ రాజధాని అన్న విశాఖ మీద రాక్షస ప్రేమను ప్రదర్శించిన వైసీపీకి రెండిందాలా భారీ మూల్యం చెల్లించుకోక తప్పింది కాదు పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అన్న తీరున ఆకుకు పోకకు చెందని విధంగా వైసీపీ ఓటమికి డిసైడ్ చేసి అటు ఉతరాంధ్రా ఇటు కోస్తా జిల్లాలు ఊచ కోత కోసేశాయి.

ఇవి పక్కన పెడితే జగన్ కి వైసీపీకి పార్టీ పుట్టిన దగ్గర నుంచి హార్డ్ కోర్ రీజియన్ గా ఉంటూ జగన్ కి కష్టకాలంలో అండగా నిలిచిన రాయలసీమకు ఏమీ చేయలేదు అన్న విమర్శలు వచ్చాయి. కర్నూల్ కి న్యాయ రాజధాని అని చెప్పినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. పైగా వారు మాకెందుకు ఈ అరకొర రాజధాని ఇస్తే పూర్తిగా రాజధాని ఇవ్వండి అని డిమాండ్ చేశారు. లేకపోతే ఇపుడు ఉన్న అమరావతిలోనే ఉండనేయండి అని కూడా అన్నారు.

అమరావతి అయితే అటు అనంతపురం కర్నూలు కడప వాసులు అందరికీ దగ్గర. అలాంటిది ఎక్కడో మూలన ఉన్న విశాఖకు పరిపాలనా రాజధాని అని చెప్పడంతో రాయలసీమ రివర్స్ అయింది. మా సీమలో పుట్టిన వైసీపీ చివరకు మాకేమీ చేయకుండా పోయింది అన్న ఆక్రోశం తో కర్నూల్ తో పాటు సీఎం జిల్లాలు అన్నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయి. దాంతో 52 సీట్లు ఉన్న సీమలో వైసీపీకి పట్టుమని అరడజన్ సీట్లు కూడా దక్కలేదు.

ఇలా నేల విడిచి సాము చేయడం దుస్సాహసానికి పోవడం వల్లనే వైసీపీకి మూడు రాజధానులలో కర్రు కాల్చి వాత పెట్టారు అని అంటున్నారు. పాలకుల ఆలోచనలు వేయి ఉండవచ్చు. అయితే వాటిలో మంచి చెడులను పూర్తిగా డిస్కషన్ లో పెట్టి జనాలు తీర్పు ఇస్తారు. మాకు వద్దు అని వారు నెత్తి మొత్తుకుంటున్నా జనాభిప్రాయం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వైసీపీ మొండిగా మూడు రాజధానుల పాట పాడడం వల్లనే ఈ దుస్థితి దాపుతించింది అని అంటున్నారు.

నిజానికి వైసీపీకి 2022 చివరిలో హై కోర్టు తీర్పు వల్ల ఒక లాభం కలిగింది. అమరావతి రాజధానినే ఏకైక రాజధాని అని హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ నేపధ్యంలో న్యాయపరమైన సూచనలను పరిగణనలోకి తీసుకుని మేము అమరావతికే కట్టుబడి ఉన్నామని చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. పైగా మరో రెండున్నరేళ్ళ అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి అమరావతి ప్రాంత వాసుల కోపాన్ని తగ్గించుకునే వీలు ఉండేది.

కానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా హై కోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకు వెళ్ళడం విశాఖలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేస్తమని పదే పదే చెప్పడం ఇవన్నీ కూడా జనాలకు ఏ మాత్రం నచ్చలేదు అందుకే వద్దన్నా విశాఖకు వస్తారా అని వారు యాంటీగా ఓట్లు గుద్దితే అమరావతిని హర్ట్ చేసినందుకు అక్కడ వాసులు షాక్ ఇచ్చారు. రాయలసీమ మొత్తం జగన్ ని మా అండ ఉండదు అని ఓటు దెబ్బ కొట్టేసింది. సో అలా ఏమీ కాని దైన్య స్థితిలో వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయింది.

Tags:    

Similar News