కులగణన... జగన్ మాస్టర్ స్ట్రోక్...!

అందుకే తనదైన శైలిలో మాస్టర్ స్ట్రోక్ లాంటి కుల గణనను బయటకు తీశారు అని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా జగన్ కి ఇది బాగా అడ్వాంటేజ్ గా ఉంది.

Update: 2023-11-06 03:57 GMT

ఏపీ సీఎం జగన్ రాజకీయాల్లో వ్యూహాలలో ఆరితేరిపోయారు. ఆయన ఫుల్ సైలెంట్. తక్కువ మాట్లాడుతారు. అందుకే ఆయన వ్యూహాలు ఎపుడూ మెదడులో తిరుగుతూ ఉంటాయని అంటారు. ఎక్కువ మాట్లాడేవారు ఎక్కడో ఒక చోట దొరికిపోతారని కూడా అంటారు.

అదే తక్కువ మాట్లాడేవారు తక్కువ తప్పులే చేస్తారు. వారు ఎపుడూ ఫోకస్డ్ గా ఉంటారు అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. జగన్ విషయం చూస్తే ఆయన వ్యూహాలను రచించడమే కాదు దూకుడుగా అమలు చేస్తారు. ఎందుకంటే ఆలోచనకూ ఆచరణకూ మధ్యన గ్యాప్ వస్తే ఫలితాలు పెద్దగా రావు.

చాలా మంది నేతలకు ఆలోచనలు వస్తాయి కానీ ఆచరణలో మీనమేషాలు లెక్కిస్తూంటారు. అందుకే జగన్ ఎక్కువ విజయాలు తక్కువ టైం లో అందుకున్నారని అంటారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల కోసం జగన్ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఒక వైపు సామాజిక బస్సు యాత్ర పేరిట బీసీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులను జనంలోకి పంపిస్తున్న జగన్ మరో వైపు వచ్చే ఎన్నికల్లో బీసీ మంత్రాన్నే గట్టిగా నమ్ముకున్నారు.

అందుకే తనదైన శైలిలో మాస్టర్ స్ట్రోక్ లాంటి కుల గణనను బయటకు తీశారు అని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా జగన్ కి ఇది బాగా అడ్వాంటేజ్ గా ఉంది. అందుకే ఆయన కుల గణనను సరైన టైం లోనే బయటకు తెచ్చారు. నిజానికి జగన్ మద్దతు ఇస్తూ లోపాయికారీగా అవగాహన పెట్టుకున్న ఎన్డీయే పాలకులు కుల గణన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు.

అదే టైం లో ఇండియా కూటమిలోని ముఖ్యమంత్రులు ఈ విషయంలో చాలా స్పీడ్ మీద ఉన్నారు. మొదట దేశంలో కుల గణన అంటూ సంచలనం రేపి రిజల్ట్ ని బయట పెట్టిన వారు బీహారె సీఎం నితీష్ కుమార్. ఆయన కుల గణనను గత ఏడాది మొదలెట్టారు. ఈ మధ్యలో కోర్టు స్టే ఇవ్వడంతో ఆగింది. మొత్తానికి పది నెలల సమయం అయితే నితీష్ ప్రభుత్వానికి పట్టింది. పదమూడు కోట్లకు పైగా జనాభా ఉన్న బీహార్ లో కుల గణన వల్ల ఓబీసీలు ఎక్కువగా ఉన్నారని తేలింది. ఇక బీసీలలో కూడా అత్యధికులు యాదవ సామాజిక వర్గం అని తేలింది.

కుల గణన అన్నది రాజకీయ పార్టీలకే ఉపయోగం, ఏపీ లాంటి చోట్ల చూస్తే సంకుల సమరమే ప్రతీ ఎన్నికలోనూ జరుగుతుంది. దాంతో కులాలను పట్టుకుని హామీలు ఇస్తూ అధికారం లోకి రావాలని అటు టీడీపీ ఇటు వైసీపీ చూస్తూ వస్తున్నాయి. ఇపుడు దేశంలో కుల గణన డిమాండ్ రావడం వైసీపీకి కలసి వస్తోంది.

ఏపీలో ఒక అంచనా ప్రకారం బీసీలే ఎక్కువగా ఉంటారు. మరి వారిలో కూడా ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అలాగే ప్రతీ నియోజకవర్గంలో కులాల డేటా ఎలా ఉంది అన్నది కనుక తెలిస్తే వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు వీలు ఉంటుంది. అంతే కాదు ఆయన చోట్ల జనాభాకు తగిన విధంగా అభ్యర్ధులను కూడా ప్రకటించడానికి వీలు అవుతుంది.

అన్ని విధాలుగా కులాలను ఆకట్టుకుని ఓట్లను పెద్ద ఎత్తున రాబట్టుకోవడానికి వీలు అవుతుంది. అందుకే జగన్ చాలా స్పీడ్ గానే ఏపీలో కుల గణనను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ నెల 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కుల గణనకి ఆమోద ముద్ర వేసిన జగన్ ఈ నెల 21 నుంచి దాన్ని చేపట్టకున్నారు.

కేవలం రెండు అంటే రెండు నెలల వ్యవధిలో కుల గణన పూర్తి చేసి వాటి వివరాలను నివేదిక రూపంలో బయట పెట్టాలని చూస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వానికి రూట్ లెవెల్ వరకూ సచివాలయ వ్యవస్థ ఉంది. అందువల్ల చాలా ఈజీగా డేటా మొత్తం తక్కువ టైం లో చేతిలోకి వస్తుంది అని అంటున్నారు. దాని ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.

ఏపీలో బీసీ ఓటు బ్యాంక్ ని తన వైపునకు టోటల్ గా తిప్పుకుని టీడీపీ జనసేన పొత్తులను దెబ్బతీయాలని చూస్తున్న జగన్ కి కుల గణన ఇపుడు వజ్రాయుధంగా మారబోతోంది. విపక్షాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టడమే కాదు సొంత పార్టీ వారికి టికెట్ నిరాకరించడానికి కూడా ఈ కుల గణన ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

ఇప్పటికే బీసీలకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం నా ఎస్టీలు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటోంది. ఇపుడు అధికారికంగా సంఖ్యాబలంతో మరింగ బిగ్ సౌండ్ చేయనుంది అని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా కుల గణన అన్నది వైసీపీ రాజకీయ పద్మవ్యూహంగా కనిపిస్తోంది. మరి దీని మీద విపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News