‘పాఠాలు నేర్చుకుందాం’... లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ కీలక వ్యాఖ్యలు!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకున్న జగన్... తన పార్టీ క్యాడర్ ను రెగ్యులర్ గా కలుస్తున్నారు.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాడర్ లో సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లీగల్ సెల్ కు కలిశారు.
అవును... వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా "మనది యంగ్ పార్టీ.. నాతోపాటు మీరంతా యంగ్ స్టర్.. మనం ఎదగాల్సింది చాలా ఉంది.. సంస్కరణలు చేసుకొవాల్సి ఉంటే, మంచి పాఠాలు ఎక్కడినుంచైనా నేర్చుకొవాల్సి ఉంటే తీసుకుందాం.." అని జగన్ స్పష్టం చేశారు.
"ఆ విధంగా మంచిని తీసుకుని, వాటిని మనం అలవాటు చేసుకుందాం.. మార్పులు చేసుకుంటూ, ఆర్గనైజేషన్ ని ప్రజలకు, జిల్లా నాయకులకు, స్థానిక నాయకులకు దగ్గర చేద్దాం.." అంటూ వైసీపీ ఐసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సూచించారు. లీగల్ సెల్ ప్రతినిధులతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో... గతంలో ఏ లాయర్ కి కూడా ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయలేదని తెలిపిన జగన్... తమ హయాంలో వైఎస్సార్ లా నేస్తం పేరుతో నెల నెలా రూ.5వేలు స్టైఫండ్ ఇచ్చామని గుర్తు చేశారు. అయితే... తాజాగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంలో ఆ సాయం నిలిచిపోయిందని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలకు లీగల్ సెల్ ప్రతినిధుల అవసరం ఉందని జగన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా లీగల్ సెల్ లను మరింత బలోపేతం చెస్తామని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు. ప్రతీ లీగల్ సెల్ ప్రతినిధి కార్యకర్తలకు అండగా, తోడుగా నిలబడాలని జగన్ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమయంలో... అందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాల్ని ప్రజలకు చూపగలమని వివరించారు.