జగన్ చేసిన సంతకం.. చంద్రబాబు కాదనలేరు.. వద్దనలేరు..!
వైసిపి హయాంలో జరిగిన అనేక నిర్ణయాలు, అనేక పాలసీల విషయంలో మార్పులు చేర్పుల దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే
వైసిపి హయాంలో జరిగిన అనేక నిర్ణయాలు, అనేక పాలసీల విషయంలో మార్పులు చేర్పుల దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పథకాలకు పేర్లు మార్చారు. కొన్నింటిని కొత్తగా ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్నారు. అయితే, ప్రధానంగా ఎన్ని మార్పులు చేయాలనుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వద్ద చేసుకున్న ఒప్పందాలు.. చేసిన సంతకాలు వంటి వాటిని మార్చడం చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
మానసికంగా చూస్తే ఆయా ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఉంది. కానీ కేంద్రంలో ఉన్న బిజెపితో పొత్తు పెట్టుకోవడం, బిజెపితో స్నేహంగా కొనసాగుతూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో వాటిని కాదంటే బిజెపి ఏమంటుందో అనే ఒక సమస్య ఇప్పుడు చంద్రబాబుకు ఏర్పడింది. ప్రధానంగా రెండు కీలక అంశాలు ఇప్పుడు చంద్రబాబుకు సంకటంగా మారాయి. ఒకటి చెత్త పై పన్ను. ఇది జగన్ హయాంలో 2020లో తీసుకొచ్చిన కీలక అంశం. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.
దీని ప్రకారం చెత్తను కూడా ఆదాయంగా మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో దాని మీద పన్ను వెయ్యాలని సంకల్పం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగన్ రాష్ట్రంలో అమలు చేయడం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కొన్నాళ్లపాటు నిలిపి వేసినా తర్వాత మళ్ళీ కొనసాగిస్తున్నారు. వాస్తవానికి చెత్త మీద పనులు తీసేస్తామని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పినా దీన్ని చేయలేకపోయారు. దీనికి కారణం చెత్త మీద పన్ను వేయడం ద్వారా కొంతమేరకు అప్పు తెచ్చుకునే వెసులబాటు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీన్ని జగన్ వినియోగించుకున్నారు.
ఇప్పుడు దీన్ని తీసేస్తే ఈ సంవత్సరం రావలసినటువంటి అదనపు అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం లేదు. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెత్తపై పన్ను విధించడం ద్వారా కొంతమేరకు అప్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని కాదంటే వచ్చే అప్పులు ఆగిపోతాయి. అలాగని కొనసాగిస్తే ఇటు ప్రజల్లో వ్యతిరేకత కొనసాగుతుంది. దీంతో చంద్రబాబు సంకట స్థితిని ఎదుర్కొంటు న్నారని చెప్పాలి. ఇక రెండో అంశం స్మార్ట్ మీటర్లు. రాష్ట్రంలో రైతులు వినియోగిస్తున్న విద్యుత్తుకు మీటర్లు పెట్టాలని, ఎంత విద్యుత్ వాడుతున్నారనేది తెలుసుకోవాలని కేంద్రం చెబుతోంది.
రాను రాను విద్యుత్ విషయంలో వస్తున్న నష్టాలు కేంద్ర ప్రభుత్వంపై పడుతున్న భారం వంటివి గమనించిన మోడీ ప్రభుత్వం.. 2019 నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు. స్మార్ట్ మీటర్లు పెడితే అదనంగా 0.5% అప్పులు తెచ్చుకునేందుకు అనుమతిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ అప్పు కోసమైనా మీటర్లు పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మీటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికలకు ముందు దీని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుకు ఇప్పుడు వీటిని తీసేయడం సమస్యగా మారింది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లను కొనసాగిస్తే ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం 0.5% అప్పు అదనంగా ఇస్తుంది. కాబట్టి అప్పు లేకుండా పథకాలు అమలు చేసే అవకాశం లేనందున స్మార్ట్ మీటర్లను కొనసాగించాలని చంద్రబాబు అంతర్గత చర్చల్లో వెల్లడవుతున్న విషయం. సో.. జగన్ చేసిన సంతకాలు, చేసుకున్న ఒప్పందాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కాదనలేని, వద్దనలేని పరిస్థితి ఏర్పడడం మాత్రం గమనార్హం.