జగన్ భావోద్వేగం...గుండె చెరువు అయిందా ?
జగన్ అంటే గుండె ధైర్యానికి మారు పేరు అని అంటారు. మిన్ను విరిగి మీద పడినా ఆయన లెక్క చేయరు
జగన్ అంటే గుండె ధైర్యానికి మారు పేరు అని అంటారు. మిన్ను విరిగి మీద పడినా ఆయన లెక్క చేయరు. అలాంటి జగన్ లో తీవ్ర ఆవేదనను ఏపీ ప్రజానీకం మొత్తం చూసింది. ఆయన ఒక దశలో గొంతులో వణుకుతో మాట్లాడారు. ఏమిటీ ఈ ఓటమి అన్నది ఆయన ఎంతో బాధతో మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆఖరి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీకి లభించిన ఘోరమైన ఓటమిని గురించి మాట్లాడుతూ చలించిపోయారు. నా అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలు అని తలచుకుంటూ ఎవరినీ మోసం చేశారు అని తాను అనలేనని అంటూనే ఏదో జరిగిందని బాధపడ్డారు.
ఇది అనూహ్యమైనది, ఫలితాలు పూర్తిగా ఆశ్చర్యం కలిగిస్తున్నాయని జగన్ అన్నారు. కనీ వినీ ఎరుగని తీరున జరిగిన పరాజయం అని జగన్ అంటున్నారు తాను ఎన్నో పాలనాపరమైన సంస్కరణలను అమలు చేశాను అని ఒక్కోటీ ఆయన ప్రస్తావించారు
ఇంటింటికీ వాలంటీర్ తో పాటు, గ్రామ సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చామని., ఏకంగా కోటీ 5 లక్షలమందికి సంక్షేమాన్ని అందించామని పేర్కొనారు. పేదల కుటుంబాలు వృద్ధి చెందాలని వారి పిల్లలు బాగుండాలని వారి అభ్యున్నతి కోసం ఎంతో చేశమని అన్నారు.
అంతే కాదు, విద్యా వ్యవస్థలో ఎన్నడూ చూడని మార్పులు తెచ్చామని అన్నారు. అదే విధంగా వితంతువులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చామని కూడా ఆయన చెప్పారు. తాను ఎన్నికల్లో ఏ విధంగా హామీలు ఇచ్చానో దానినే తుచ తప్పకుండా అమలు చేశాను అని అన్నారు.
అలా అయిదేళ్ళ పాటు తాను చేసిన ఆ మంచి పనులు ఏమైపోయాయో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల చూపించే ఆ పేద ప్రజల ప్రేమ ఏమైపోయిందో అర్థం కావడం లేదని జగన్ అన్నారు. అంతే కాదు ఠంచనుగా ఏపీలోని 55 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చామని, అలాంటి రైతన్నలు అండగా తన పార్టీ పట్ల లేరని ఆయన బాధను వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అందుకున్న వారి ఆప్యాయత సైతం ఎక్కడికి పోయిందో ఏమైందో తెలియదు అని జగన్ ఆవేదన చెందారు.
ఇలాంటి ఫలితాలు వచ్చాయీ అంటే అసలు ఏమి జరిగిందో తనకు తెలియడం లేదని అన్నారు. అయితే ఎవరు ఎంత చేసినా ఏమి చేసినా వైసీపీకి మాత్రం 40 శాతం ఓటు బ్యాంకును ఎక్కడా ఏ ఏ విధంగానూ తగ్గించలేక పోయారని ఆయన అన్నారు.
అందుకే తాము మళ్ళీ పేదల గొంతుక అవుతామని ఈ స్థితి నుంచి కచ్చితంగా పైకి లేస్తామని, అదే గుండె ధైర్యంతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు తనకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదని జగన్ అన్నారు.
కేవలం ఐదేళ్లు తప్ప తన మొత్తం రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలోనే సాగింది అని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక పోరాటాలు చేశానని, అదే విధంగా తన రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు కూడా అనుభవించానని జగన్ అన్నారు.
ఇక ఈసారికి కూడా తాను అంతకుమించిన కష్టాలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. టీడీపీ కూటమికి చంద్రబాబుకు పవన్ కి బీజేపీకి ఆయన అభినందనలు తెలియచేశారు. అంతే కాదు, తనకు ఈ రోజుకీ వెన్నంటి ఉంటూ తన ప్రతి కష్టంలో కూడా తోడుగా, అండగా నిలబడిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి జగన్ స్పీచ్ మొత్తం భావోద్వేగంతో సాగింది. అదే టైం లో మళ్లీ జనంలోకి వస్తామని ప్రజా పోరాటాలు చేస్తామని జగన్ స్పష్టం చేశారు.