జగన్ ఓడిపోవడానికి ఇప్పటికి కారణం దొరికింది!

వైఎస్సార్ మరణాంతరం జగన్ వైపు కాంగ్రెస్ వైపు ఉన్న అభిమానులు అందరూ టర్న్ అయ్యారు

Update: 2024-07-02 14:30 GMT

వైఎస్సార్ మరణాంతరం జగన్ వైపు కాంగ్రెస్ వైపు ఉన్న అభిమానులు అందరూ టర్న్ అయ్యారు. జగన్ పావురాల గుట్ట మీద ఇచ్చిన స్పీచ్ తో వారు అలా ఆయన వైపుగా మళ్లారు. ఆనాడు ఏపీలో ఉన్న యువత కూడా జగన్ లో కొత్త నాయకుడిని చూసి ఆయనకు మద్దతుగా నిలిచారు. అలా తనకు దక్కిన అనూహ్య మద్దతుని చూసి జగన్ జనంలో ఉండాలని అపుడే డిసైడ్ అయ్యారు.

తన తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చాలని ఆయనకు అపుడే ఆలోచన వచ్చింది. అలా జగన్ జనంలోకి వెళ్తే విపరీతమైన స్పందన లభించింది. దాంతో కాంగ్రెస్ హై కమాండ్ ఈ రెస్పాన్స్ చూసి ఒక విధంగా బెంబేలెత్తింది. దాంతో జగన్ తో పాటు ఆయన కుటుంబాన్ని పిలిపించి ఓదార్పు యాత్ర చేయవద్దు అందరినీ ఒకే దగ్గరకు పిలిచి ఓదార్పు యాత్ర చేయండి అని సూచించింది.

ఇక జగన్ దానికి అంగీకరించకుండా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెడితే అధికార కాంగ్రెస్ లో ఉన్న వారిలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. అలా ఉప ఎన్నికలు వస్తే అందులో 16 మంది గెలిచారు. ఇక లాభం లేదని కాంగ్రెస్ జగన్ మీద సీబీఐ ఈడీ కేసులు పెట్టిస్తే ఆయన పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపారు.

ఆ సమయంలో జగన్ చెల్లెలు షర్మిల ఏపీలో మరో ప్రజా ప్రస్థానం పేరుతో తిరిగి పార్టీని నిలబెట్టారు. ఏ అమ్మాయి కూడా తిరగనంతగా ఆమె తిరిగి ఏపీలో పాదయాత్ర చేశారు. ఆ తరువాత 2014లో జగన్ కి బెయిల్ రావడం సానుభూతి ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా పనిచేయడంతో 67 ఎమ్మెల్యేలను గెలిపించుకుని జగన్ ఏపీలో బలమైన నాయకుడిగా ఎదిగారు.

Read more!

ఆ ఎన్నికల్లో కేవలం ఒక శాతమే వైసీపీకి టీడీపీకి మధ్య తేడా. అయినా ఆ ఒక్క శాతం టీడీపీకి అదనంగా 40 సీట్లను ఇచ్చింది. ఇక వైసీపీని లేకుండా చేయాలని 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అధికారంలో ఉండగా తన వైపు కలుపుకుంది. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అలా జగన్ పార్టీని క్లోజ్ చేయాలన్న ఆలోచనతో పనిచేసింది.

అలా టీడీపీ దుర్బుద్ధితో చేసిన పనితో జగన్ ఆగ్రహం చెంది అసెంబ్లీలోనే ఒక సవాల్ విసిరి మరీ జనంలోకి వచ్చారు. ఇక మీదట తాను అసెంబ్లీకి రాను అని ప్రజల వద్దకే వెళ్తాను అని ఆయన శపధమే చేశారు. అలా సుదీర్ఘంగా రెండు ఏళ్ల పాటు పాదయాత్ర చేసి జగన్ జనంతోనే మమేకం అయ్యారు. అలా పార్టీని పటిష్టం చేసుకుంటూ క్యాడర్ ని బిల్డ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సైతం స్ట్రాంగ్ గా నిలబడడంతో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ తో 151 సీట్లు వైసీపీకి దక్కాయి.

అంటే 2009 నుంచి 2019 మధ్య పదేళ్ల పాటు జగన్ కానీ విజయమ్మ కానీ షర్మిల కానీ జనంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ నిత్యం ఉన్నారు అన్నది ఇక్కడ అర్ధం అవుతోంది. జగన్ జైలులో ఉన్నా బయట ఉన్నా ఆయన గురించిన మ్యాటర్ తో వీడియో కంటెంట్ తో నిత్యం జనంలో ఉండేలా చేశారు విజయమ్మ,షర్మిలమ్మ. జగన్ ఏ డ్రెస్ వేశారు, ఆయన ఆ రోజు ఏమి చేశారు ఇలా అన్ని విషయాలు జనలకు చేరడం వల్లనే జగన్ తో ఒక ఎమోషనల్ బాండేజ్ ఏర్పడింది.

అలా జగన్ కి సంబంధించిన వీడియో కంటెంట్ ని యువత అంతా తమ సెల్ఫ్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న టీడీపీని చంద్రబాబు లోకేష్ ని సోషల్ మీడియా అంతా ట్రోల్స్ చేస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికపుడు ఎత్తి చూపుతూ వచ్చారు. అలా ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా దానిని అట్టడుగు స్థాయి దాకా ప్రజల వద్దకు తీసుకుపోతూ ఒక సైన్యంగానే వైఎస్సార్ ప్రెమించే వారు అంతా చేశారు.

జగన్ విషయంలో తెలుగు వారికి సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి తండ్రి లేని బిడ్డ అని ఆదరించారు. ఇక రైతులు అయితే చంద్రబాబు వస్తే వానలు పడవు అని భావించి వైఎస్సార్ మీద ప్రేమతో జగన్ ని గెలిపించారు.

అలా ఒకసారి జగన్ ని గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తారు అని అనుకోవడం వల్లనే భారీ మెజారిటీ ఆయనకు దక్కింది.

ఇక గెలిచిన తరువాత జగన్ షర్మిల చెప్పినట్లుగా మారిపోయారు అని సగటు వైసీపీ అభిమాని సైతం అనుకునేలా ప్రవర్తించారు అంటున్నారు. జగన్ తన సొంత తల్లిని చెల్లెలుని పార్టీని క్యాడర్ ని లీడర్స్ ని ఎమ్మెల్యేలను మంత్రులను ఎవరినీ అసలు పట్టించుకోలేదు. ఇంట్లోనే క్యాంప్ ఆఫీసు పెట్టుకుని పాలన సాగించారు.

అంతే కాదు ప్రతీ శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ కి అప్పు కోసం ఇండెంట్ పెట్టుకుంటే సోమవారం మంగళవారం నాటికి బిడ్డింగ్ లో అప్పు వచ్చేది. ఆ అప్పుతోనే పరిపాలన చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కి పంచారు. ఈ నేపథ్యంలో వ్యవస్థలను అన్నింటినీ ఆయన వదిలేశారు.

దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ చాలా గొప్పది. గ్రామాలు బాగు పడాలీ అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ తోనే సాధ్యం. అలాంటి వ్యవస్థను జగన్ సర్వనాశనం చేస్తూ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు. అదే విధంగా ప్రతీ రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టి దాదాపుగా ఏపీలో 15 వేల సచివాలయాలు ఏర్పాటు చేసారు. ఇవన్నీ అవసరానికి మించి ఏర్పాటు చేసినవే. అలా ప్రతీ సచివాలయంలో అవసరం లేకున్నా 11మంది దాకా వివిధ డిపార్ట్మెంట్ సిబ్బంది ని నియమించారు. కరోనా టైంలో ఈ వ్యవస్థ బాగానే పని చేయవచ్చు కాక కానీ దానికి ఒక యాక్షన్ ప్లాన్ అంటూ లేకుండా చేశారు. రాను రానూ జగన్ బద్ధకస్తుడిగా మారిపోయారు. బటన్ నొక్కుతూ ఆయన పాలన చేస్తూ పోయారు.

ఆయన చుట్టూ ఒక సజ్జల, ఒక విజయసాయిరెడ్డి, ధనుంజయరెడ్డి ఇలా కోటరీ ఏర్పడి భజన చేస్తూ వై నాట్ 175 అన్న స్లోగన్ తో మభ్యపెట్టారు. ఇక జగన్ తానే హీరో అని కింగ్ అని భావించుకుంటూ ఎప్పటికీ బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ గెలుపు తనదే అని అతి ధీమాకు పోయారు. తనకు ఎదురు లేదని భావించిన జగన్ అసెంబ్లీలో తన తండ్రి వయసు ఉన్న బాబుని సైతం లెక్క చేయకుండా కూర్చోమని గదమాయించడం అంతా చూసారు. ఒక దశలో జగన్ తన తండ్రి వైఎస్సార్ కంటే కూడా ఎక్కువ అని ఫీల్ అయ్యారని అంటారు.

నిండు అసెంబ్లీలో తన తోటి ఎమ్మెల్యేలు మంత్రులతో చంద్రబాబుని నానా దుర్భాషలు ఆడించారు.ఆఖరుకు బాబు కుటుంబ సభ్యుల మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేయించారు. హిందూ సంప్రదాయంలో సైతం వాడని భాషను వాడి వైసీపీ నేతలు బాబు మీద రెచ్చిపోయారు. అలా చంద్రబాబుని ఆయన సతీమణిని దూషించారు. దాంతో చంద్రబాబు కౌరవ సభకు ఒక దండం పెట్టేశారు. తాను తిరిగి సీఎం గానే సభలోకి అడుగుపెడతాను అన్నారు. ఆయన జనంలోకి వెళ్లారు. పార్టీని పూర్తిగా పటిష్టం చేసుకున్నారు.

అయితే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో తిరగకుండా ఆంక్షలు పెట్టడమే కాదు ఆయన మీద కేసులు పెట్టి మరీ అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు నథింగ్ అని తన ఎమ్మెల్యేలతో జగన్ చెప్పిన వీడియోలు ఈ రోజుకూ వైరల్ అవుతున్నాయి. తన మిడి మిడి జ్ఞానంతో ఏ మాత్రం సబ్జెక్ట్ లేకుండా చిన్న కేసులో బాబుని అరెస్ట్ చేయించారు.

అప్పటివరకూ కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు.బాబు అరెస్ట్ తరువాత పవన్ వేగంగా పావులు కదిపారు. ఆ వెంటనే జైలులో ఉన్న చంద్రబాబుని కలసి వచ్చి టీడీపీ జనసేన పొత్తుని కన్ ఫర్మ్ చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని నాలుగు పెళ్ళిళ్ళూ అని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ జగన్ దూకుడు చేశారు. అయితే మొదట్లో పవన్ పట్ల పెద్దగా స్పందించని కాపు సామాజికవర్గం ముద్రగడ పద్మనాభం హరి రామజోగయ్య వంటి వారి ద్వారా పవన్ మీద ఎటాక్ చేయించడంతో పవన్ కి అండగా అంతా ఒక్కటి అయ్యారు.

ప్రపంచంలో ఉన్న కాపు సామాజిక వర్గం అంతా పవన్ వైపు మళ్ళగా కమ్మ సామాజిక వర్గం అంతా టీడీపీ వైపు మళ్ళింది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఇతర అగ్ర వర్ణాలు బీజేపీ వైపు మళ్ళారు. మాకు ఏమీ చేయని జగన్ వైపు ఎందుకు ఉండాలని రెడ్డి సామాజిక వర్గంలో నలభై శాతం టీడీపీ కూటమి వైపు మళ్ళింది. ఈలోగా ఏపీసీసీ చీఫ్ గా వచ్చిన షర్మిల జగన్ మీద భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఆయన్ని టార్గెట్ చేశారు. వివేకా మర్డర్ కేసుని ముందుకు తెచ్చి ఇరకాటంలో పెట్టారు.

జగన్ కి ఓటు వేయండి అని చెప్పకుండా షర్మిలకు ఓటు వేయండి అని విజయమ్మ చెప్పడంతో రాయలసీమలో పది శాతం ఓటు షేర్ కూటమి వైపు మళ్ళింది. దాంతోనే ఎవరూ ఊహించని విధంగా టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తే జగన్ కి 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందులో ఒక్క జగన్ తప్ప మిగిలిన వారు అంతా బొటా బొటీ మెజారిటీతోనే వైసీపీ తరఫున గెలిచారు.

ఇంట్లో కూర్చుంటే పరిపాలన జరగదు, అప్పులు తెచ్చి డబ్బులు పంచితే అది పరిపాలన అనుకోవడం వెర్రితనం. మనిషికి వెన్నెముక మాదిరిగా పార్టీకి క్యాడర్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వారియర్స్ ముఖ్యం. ఓటమి చెందాక ఈవీఎంల మీదకు నెట్టిటే ఏమి లాభం అంటున్నారు.

ఇప్పటికైనా బహిరంగంగా వైసీపీ క్యాడర్ కి చేసిన అన్యాయాన్ని చెప్పి సోషల్ మీడియా తో పాటు క్యాడర్ ని దగ్గరకు తీసుకుంటాను గుండెలలో పెట్టుకుంటాను అని చెబితే తప్ప వైసీపీకి ఉనికి ఉండదని అంటున్నారు. ఐ ప్యాక్ టీం కాదు గెలిపించేది, ఏ పొలిటికల్ కన్సల్టెన్సీ అసలు గెలిపించలేదు వైసీపీని గెలిపించేది క్యాడర్ అన్నదే తెలుసుకోవాలి. అదే మా అధ్యయనంలో తేలింది.

Tags:    

Similar News

eac