ఢిల్లీలో జగన్ ధర్నా... 24వ తేదీనే ఎందుకు?

ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే

Update: 2024-07-21 06:43 GMT

ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత బుధవారం రాత్రి పల్నాడు జిల్లాలోని వినుకోండలో నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్తగా చెబుతున్న రషీద్ ని జిలానీ అనే వ్యక్తి కత్తితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. దీంతో... ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

దీంతో... రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లారు. రషీద్ తల్లి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్.. రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడంతోపాటు పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో భాగంగా... ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో... వినుకోండలో నడిరోడ్డుపై జరిగిన దారుణాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లే క్రమంలో... ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నావల్ల జాతీయ స్థాయిలో వినుకొండ ఇష్యూను చర్చనీయాంశం చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... 24వ తేదీనే ఎంచుకోవడంలో అంతర్లీనంగా మరో వ్యూహం దాగి ఉందని అంటున్నారు.

అవును... వినుకోండలో జరిగిన రషీద్ హత్యకు నిరసనగా ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే... జూలై 17 బుధవారం హత్య జరిగింది, జూలై 24 బుధవారం ధర్నా చేస్తున్నారు.. వారం గ్యాప్ ఇచ్చారు.. దీనిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అని చెప్పడానికి మాత్రమే జగన్ ధర్నా అని భావిస్తే పొరపాటే అంటున్నారు పరిశీలకులు.

దీనివెనుక అసలు వ్యూహం వేరే ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూలై 25న ఏపీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా... ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం సభకు సమర్పించనుంది.

సరిగ్గా దానికి ఓ రోజు మూందు జగన్ ధర్నాకు ప్లాన్ చేశారు. ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి ధర్నా అంటే కచ్చితంగా హాట్ టాపిక్ గా మారుతుంది. సహజంగానే జాతీయ మీడియా ప్రసారం చేస్తుంది. దీంతో మరుసటి రోజు ఇదే హెడ్ లైన్స్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా... ఏపీ స్టేట్ బడ్జెట్ పై చర్చ పక్కదారి పట్టే అవకాశం ఉందని జగన్ భావించే... జూలై 24వ తేదీని ఢిల్లీలో ధర్నాకు ఎంపిక చేసుకున్నారని అంటున్నారు.

ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా.. రాష్ట్రంలో వైసీపీని పుంజుకునేలా చేయాలన్నది జగన్ మరో వ్యూహంగా చెబుతున్నారు. పైగా ఎన్నికల ఫలితాలు వెలువడి నెలన్నర రోజులు కావొస్తున్నా.. కడప, పులివెందుల మినహా జగన్ మరోచోట జనంతో కలిసింది లేదు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు డల్ అయిపోయారని అంటున్నారు. ఈ సమయంలో ఈ ధర్నా కచ్చితంగా కార్యకర్తల్లో ఎంతో కొంత ఉషారు తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరి ఇటు ఏపీలోనూ, అటు కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వాలే ఉన్న నేపథ్యంలో... హస్తినలో జగన్ ధర్నాకు వచ్చే స్పందన సంగతి కాసేపు పక్కనపెడితే.. వచ్చే రిజల్ట్ ఏమిటనేది ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News