జగన్ విదేశీ టూర్.. ఉందీ లేనిదీ.. తేలేది వచ్చే వారమే
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెలు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో చదువుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెలు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో చదువుతున్నారు. పెద్ద కుమార్తె గతంలోనే ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చేరారు. చిన్న కుమార్తె కూడా తర్వాత కాలంలో యూకేలోనే విద్యాభ్యాసానికి వెళ్లారు. దీంతో జగన్ ఆయన భార్య వైఎస్ భారతిలు తమ పిల్లలను కలిసేందుకు యూకే వెళ్తుంటారు. ఇటీవలి ఎన్నికల ముందు జగన్ దంపతులు యూకే వెళ్లి సుదీర్ఘ పర్యటన చేశారు.
వచ్చే నెల మొదటివారంలో..
పెద్ద కుమార్తె హర్ష యూకేలో చదువుతున్న నేపథ్యంలో ఆమెను కలిసేందుకు సెప్టెంబరు మొదటివారంలో జగన్ ఆ దేశం వెళ్లాలని భావిస్తున్నారు. దీనికోసం ఆయన ముందస్తు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. కాగా, జగన్ పై 2010-11 నుంచి అక్రమాస్తుల కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ ఆయనపై కేసులు నమోదు చేశాయి. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరి అవుతోంది. మరోవైపు జగన్ 2019-24 మధ్యన ఏపీకి సీఎంగా ఉన్న సమయంలోనూ విదేశీ పర్యటనలు చేశారు.
అనుమతి ఇవ్వొద్దన్న సీబీఐ
విదేశీ టూర్ కు అనుమతి కోరుతూ జగన్ వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. బుధవారం జగన్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా, యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్ లో జగన్ కోరారు. దీనిని ఇటీవల పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో సీబీఐ వాదనలు వినిపించింది.