నాన్నలాగే 'నిండు ఐదేళ్లూ' సీఎంగా రికార్డు.. రెండోసారి మాటేమిటో జగన్?
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎందరో సీఎంలుగా పనిచేశారు
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎందరో సీఎంలుగా పనిచేశారు. కాంగ్రెస్ లో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండేసి సార్లు సీఎంలు అయ్యారు. టీడీపీ నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు కూడా రెండుసార్లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే, వీరిలో ఐదేళ్లూ సీఎంగా కుర్చీలో కూర్చున్న ఘనత మాత్రం ఒక్కరికే దక్కింది.
నాన్న బాటలో నడిచి
చంద్రబాబు ఉమ్మడి ఏపీకి రెండుసార్లు సీఎంగా చేసినా.. విభజిత ఏపీకి మాత్రమే పూర్తి కాలం సీఎంగా ఉన్నారు. కాగా, ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న ఏకైక కాంగ్రెస్ సీఎం. 2004 మే 14 తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2009 మే 14 వరకు సీఎంగా కొనసాగారు. 2009లో మరోసారి పార్టీని గెలిపించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆ ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కాగా, తండ్రి బాటలోనే పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ 2019 మే 30న సీఎంగా కుర్చీనెక్కారు. ఈ ఏడాది మే 30 వరకు ఆయన పదవిలో ఉంటారు. ఈ నెల 13నే పోలింగ్ పూర్తయినప్పటికీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. అంటే.. ఫలితాలకు ముందే జగన్ నిర్ణీత ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారన్నమాట.
చెరిగిపోని రికార్డు..
భారత దేశంలో తండ్రీ కొడుకులు సీఎం అయిన ఉదంతాలు ఉన్నప్పటికీ జగన్ తరహాలో 15 ఏళ్ల వ్యవధిలోనే మాజీ సీఎం కుమారులెవరూ సీఎంలు కాలేదు. ఇప్పుడు అచ్చం తండ్రిలాగే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు జగన్. మరి నాన్నలాగే వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తారా? ఏమో జూన్ 4న చూద్దాం.
కొసమెరుపు: తన ఐదేళ్ల పదవీ కాలాన్ని మే 31తో పూర్తిచేసుకునే జగన్ ఈసారి ఆ సమయానికి విదేశాల్లో ఉండనున్నారు. ప్రవాస వైసీపీ అభిమానుల ఆధ్వర్యంలో బహుశా అక్కడే ఏమైనా కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపట్టే వీలుంది.