వాలంటీర్ అంటే నేనే...సీఎం సంచలనం...!
వాలంటీర్ వార్ ఏపీలో సాగుతోంది. ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఏపీలో 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఏర్పాటు చేశారు
వాలంటీర్ వార్ ఏపీలో సాగుతోంది. ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఏపీలో 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ వైసీపీ ఏ ఉద్దేశ్యంతో చేసినా దాని మీద లెక్కలేనంతగా రాజకీయం గత అయిదేళ్లుగా సాగుతూ వచ్చింది. వాలంటీర్ ఉండరాదు అన్నట్లుగా ఒక దశలో విపక్షాలు విమర్శలు వీర లెవెల్ లో చేశాయి.
అయితే ఇటీవల కాలంలో టీడీపీ జనసేన టోన్ మార్చాయి. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మరింత మెరుగైన జీవితాన్ని ఇస్తామని కూదా ప్రకటించాయి. ఈ నేపధ్యంలో వాలంటీర్ల సేవలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని విపక్షాలు కోరడం దానికి ఈసీ ఓకే చెప్పడం జరిగింది.
ఆ మీదట మరో అడుగు ముందుకేసి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు కూడా ఈ మూడు నెలలు వద్దు అన్న మరో వినతి మీద ఈసీ ఆమోదముద్ర వేసింది. దాంతో వాలంటీర్లు మూడు నెలల పాటు విధులకు దూరం అయ్యారు.
ఇక ఇంటింటికీ పెన్షన్ వాలంటీర్లు అందించే విధానం కూడా లేకుండా పోయింది. ఇది ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య పొలిటికల్ వార్ కి కారణం అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ వాలంటీర్ల మీద సంచలన వ్యాఖ్యలే చేశారు.
వాలంటీర్ అంటే ఎవరో కాదు తానే అన్నారు ఆయన వాలంటీర్ల వ్యవస్థ క్రియేటర్ అని గర్వంగా చెప్పుకున్నారు సీఎం. వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్ గుర్తుకు వచ్చి తీరుతారు. అలా పాలనా వ్యవస్థలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ఇది దేశంలో ఎన్నడూ చూడని సంస్కరణ అని ఆయన అంటున్నారు.
మరో వైపు చూస్తే వాలంటీర్ల సేవలు చాలా గొప్పవని ఆయన అన్నారు. ప్రతీ నెలా ఒకటవ తేదీన పండుగ అని చూడకుండా సెలవు అని అసలు చూడకుండా అవ్వా తాతల వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చిన వారు వాలంటీర్లు అని ఆయన కొనియాడారు. పౌర సేవలు లబ్దిదారులకు అందించడంలో వారి సేవలు చాలా గొప్పవని అన్నారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థ రద్దుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు.
జగన్ మీద కోపంతో పేదలు వృద్ధుల మీద ప్రతాపం చూపించారు అని ఆయన ఫైర్ అయ్యారు. వాలంటీర్ల వ్యవస్థ కానీ ఇంటింటికీ పధకాలు కానీ రావాలీ అంటే మళ్లీ జగనే అధికారంలోకి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు అంధ్య వారధిగా ఉన్న వాలంటీర్లను దూరం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు అని ఆయన విపక్షం మీద విమర్శలు గుప్పించారు. ప్రజలకు మంచి చెడు ఏదో అన్నది అర్ధం అవుతోందని ఆయన అన్నారు.వారు ఈసారి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.