ఆయనను చూస్తే జగన్ కి భయమా ?
స్పీకర్ గా పదవీ బాధ్యతలు తీసుకుని తన సొంత నియోజకవర్గం నర్శీపట్నానికి తొలిసారి వచ్చిన అయ్యన్నకు ఘనంగా పౌర సన్మానం జరిగింది.
ఇంతకీ ఎవరాయన ఎందుకు జగన్ కి భయం అంటే విషయం లోకి వెళ్లాల్సిందే. కొత్త స్పీకర్ గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని చూస్తే మాజీ సీఎం జగన్ కి భయం అని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. స్పీకర్ గా పదవీ బాధ్యతలు తీసుకుని తన సొంత నియోజకవర్గం నర్శీపట్నానికి తొలిసారి వచ్చిన అయ్యన్నకు ఘనంగా పౌర సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ జగన్ కి అయ్యన్న అంటే భయం అని హాట్ కామెంట్స్ చేశారు. అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదు అని అన్నారు. అధికారంలో ఉండగా అయ్యన్నను ముప్పతిప్పలు పెట్టింది జగన్ ప్రభుత్వం అని ఆమె ఫైర్ అయ్యారు.
అలాంటి అయ్యన్నను ఇపుడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ వేడుకోవడమే రాజకీయ విచిత్రం అని ఆమె సెటైర్లు వేశారు. అయ్యన్న దేనికీ వెరవకుండా అయిదేళ్ళూ వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేసారని అందుకే ఆయనకు ఉన్నత పదవి లభించిందని ఆమె అన్నారు. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదాకు కూడా సరిపడా సీట్లు ఇవ్వకుండా తీర్పు ఇచ్చారని ఆమె అన్నారు.
ఇదే సభలో మాట్లాడిన అయ్యన్న తన నోరుని చంద్రబాబు కట్టేశారు అని సంచలన కామెంట్స్ చేశారు. తనకు స్పీకర్ పదవిని ఇవ్వడం ద్వారా బాబు గతంలో మాదిరిగా మాట్లాడకుండా చేశారని అన్నారు. తాను ఇక మీదట హుందా రాజకీయాలే చేస్తానని స్పీకర్ పదవికి వన్నె తెస్తానని అన్నారు. దాని కంటే ముందు మీడియాతో మాట్లాడిన అయ్యన్న జగన్ ప్రతిపక్ష హోదా కోరుతూ లేఖ రాసారని దాని మీద చట్ట ప్రకారమే తాను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం విశేషం.
ఈ సంగతి పక్కన పెడితే జగన్ కి భయం అని అనిత వ్యాఖ్యానించడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ కి భయం అన్నది తెలియదని వారు అంటున్నారు. స్పీకర్ అన్నది రాజ్యాంగ పదవి అని ఆ పదవిలో ఎవరు ఉన్నా రాజకీయాలకు అతీతంగా ఉండాలని అందుకే తమ నాయకుడు లేఖ రాసి ప్రతిపక్ష హోదా విషయంలో ఉన్న విధానాన్ని చెప్పారని అంటున్నారు.
మొత్తం మీద చూస్తూంటే టీడీపీ నేతలు మంత్రులు జగన్ మీద విమర్శల జోరు అయితే గట్టిగానే పెంచుతున్నారు. అయితే హానీ మూన్ పీరియడ్ కాబట్టి తాము సహనంతో ఉంటున్నమని వైసీపీ నేతలు బదులిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ అసెంబ్లీకి తప్పకుండా రావాల్సిందే అన్నది సాదర జనంతో పాటు మేధావుల మాట.
ఆయన సభకు రాకపోతే అయ్యన్న అంటే భయం అని టీడీపీ మరింతగా ప్రచారం చేస్తుందని కూడా అంటున్నారు. ప్రజాస్వామ్యంలో భయపడాల్సింది ఎవరైనా ప్రజలకే అని కూడా అంటున్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతలను విస్మరించే వారే భయపడాల్సి ఉంటుందని కూడా గుర్తు చేస్తున్నారు.