బటన్ నొక్కడం తప్ప జగన్ ఏం చేశారు?: రక్షణ నిధి
తిరువూరులో ఎమ్మెల్యేగా, విపక్షంలో పనిచేశానని, కానీ, బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి, ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని రక్షణ నిధి ఆరోపించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమ సొంత పార్టీతో పాటు, అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ జగన్ పై సైతం పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే, జక్కంపూడి రాజా, కేతిరెడ్డిలు సీఎంవో అధికారులపై, సీఎం చుట్టూ ఉండే కోటరీపై తమ అసంతృప్తి వెళ్లగక్కారు. ఇక, తాజాగా తిరువూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి, తిరువూరు వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలైన నల్లగట్ల స్వామిదాస్ తాజాగా జగన్, ఐప్యాక్, ఆరా మస్తాన్, సలహాదారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తిరువూరులో ఎమ్మెల్యేగా, విపక్షంలో పనిచేశానని, కానీ, బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి, ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని రక్షణ నిధి ఆరోపించారు. జగన్ వల్ల తిరువూరును అభివృద్ధి చేసుకోలేకపోయానని, అందుకే, వైసీపీ దారుణంగా ఓడిపోయిందని అన్నారు. జగన్ హామీలు నీట మునిగాయని, తాను 2023 డిసెంబర్ నుంచి వైసీపీకి దూరంగా ఉన్నానని చెప్పారు. ఐ ప్యాక్, సలహదారులను నమ్మి జగన్ నట్టేట మునిగారని విమర్శించారు. ప్రజల మధ్య తిరిగిన తమను కనీసం కలుసుకోలేదని, తమను అడగలేదని, ఎప్పుడైనా ఎమ్మెల్యేలను గుర్తించావా జగన్ అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను, కార్యకర్తలను జగన్ ఏనాడూ పట్టించుకోలేదని, అందుకే పార్టీ ఓటమిపాలైందని విమర్శించారు. ఎమ్మెల్యేలను కలిసే తీరిక జగన్ కు లేదని, పథకాలపై ప్రచారం తప్ప తాము చేసిందేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము అడిగిన ఏ పనీ జగన్ చేయలేదని, చుట్టూ తిరిగినా ఉపయోగం లేదని అన్నారు.
కూటమిని కలిపిన దమ్మున్న మొనగాడు పవన్ కళ్యాణ్ అని రక్షణ నిధి ప్రశంసించారు. తిరువూరులో గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్ది కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నికి శుభాకాంక్షలు తెలిపారు. తాను కూటమికి మద్దతుగా ప్రచారం చేశానని, తన రాజకీయ భవిష్యత్తుకు కాలమే సమాధానం చెబుతుందని చెప్పారు. ఇక, ఎన్నికల్లో ఆర్ధికంగా దెబ్బతిన్నామని, కొన్ని పొరపాట్లు జరిగాయని స్వామినాధ్ అన్నారు. ఐప్యాక్ టీం మోసం చేసిందని, ఆరా మస్తాన్ అడ్డంగా ముంచేశాడని చెప్పారు.
అయితే, బయటపడ్డ ఎమ్మెల్యేలు ఇలా విమర్శలు గుప్పిస్తున్నా జగన్ తీరు మారలేదన్న విమర్శలు వస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలను జగన్ నిలుచోబెట్టే మాట్లాడుతున్నారని, కనీసం కూర్చోబెట్టి మాట్లాడాలన్న సంస్కారం కూడా జగన్ కు లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ రకమైన అహంకారపూరిత ధోరణి వల్లే జగన్ ఓటమి పాలయ్యారని, అయినా సరే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలంటిస్తున్నారు.