కాబోయే మంత్రి గారు... జగన్ బంపర్ ఆఫర్...!

ఇక సీఎం జగన్ మాట్లాడుతూ అదిగో అక్కడ మీ మంత్రి గారు ఉన్నారు, కాబోయే మంత్రి అని బాలినేని శ్రీనివాసరెడ్డిని చూపించారు.

Update: 2024-03-06 12:30 GMT

ప్రకాశం జిల్లా టూర్ లో జగన్ సంచలన కామెంట్స్ చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వేదిక మీద ఏకంగా తమ పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. వారిని మంచి మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరడం విశేషం.

ముందుగా ఆయన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఎంపీ అభ్యర్ధిగా పరిచయం చేయడం విశేషం. భాస్కరన్న అంటూ ఆయన్ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక అదే వరసలో మంత్రులు నాగార్జున, ఆదిమూలం సురేష్ లను గెలిపించాలని పిలుపు ఇచ్చారు.

ఇక సీఎం జగన్ మాట్లాడుతూ అదిగో అక్కడ మీ మంత్రి గారు ఉన్నారు, కాబోయే మంత్రి అని బాలినేని శ్రీనివాసరెడ్డిని చూపించారు. దాంతో సభలో ఒక్కసారి ఆయన అభిమానులు సందడి చేశారు. వరసబెట్టి అభ్యర్ధులను పరిచయం చేసిన జగన్ బాలినేని వద్దకు వచ్చేసరికి మంత్రి అనడంతో ఆయన వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.

బాలినేని 2019 నుంచి 2022 ఏప్రిల్ దాకా జగన్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తరువాత విస్తరణలో ఆయనకు చాన్స్ దక్కలేదు. ఇవన్నీ పక్కన పెడితే బాలినేనిని పిలిచి మరీ పెద్ద పీట వేయడం చూస్తూంటే జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయం అంటున్నారు.

జగన్ జోరు కూడా గత రెండు రోజులలో ఎక్కువగానే ఉంది. ఆయన విశాఖ సభలో మాట్లాడుతూ సీఎం గా తాను వైజాగ్ నుంచి ప్రమాణం చేస్తాను అని చెప్పారు. ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ప్రకాశం జిల్లాకు వెళ్ళి తన క్యాబినెట్ లో తొలి మంత్రిని ప్రకటించారు. ఇలా జగన్ గెలుపు అన్నది లాంచనం అన్నట్లుగా వ్యవహరించడం చూస్తూంటే విపక్ష శిబిరానికి ఇది మాస్టర్ స్ట్రోక్ అని అంటున్నారు.

విపక్షాలు గెలుస్తామని చెబుతున్నాయి కానీ జగన్ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రుల జాబితా చెబుతున్నారు. అభ్యర్ధుల జాబితాలో విపక్షం బిజీగా ఉంది. దీంతో జగన్ లో గెలుపు ధీమా ఎక్కువగా ఉందని అంటున్నారు. అదే టైం లో ఆయన ధీమా వెనక ఉన్న అంశాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. విపక్షాన్ని దెబ్బ తీసేందుకు జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఏది ఏమైనా బాలినేనిని మంత్రి గారు అని జగన్ చెప్పడం ద్వారా ప్రకాశం టూర్ లో కొత్త సంచలనం రేపారు అని అంటున్నారు.

Tags:    

Similar News