వైసీపీ ధర్నాకు వెళ్ళేదెంతమంది ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల మీద దాడులు చేస్తున్నారని హత్యా కాండ సాగుతోందని ఆరోపిస్తూ ఈ ధర్నా సాగుతోంది

Update: 2024-07-21 06:30 GMT

వైసీపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 24న భారీ ధర్నాకు ప్లాన్ చేసింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల మీద దాడులు చేస్తున్నారని హత్యా కాండ సాగుతోందని ఆరోపిస్తూ ఈ ధర్నా సాగుతోంది.

అయితే ఈ ధర్నా ఈ నెల 24 అంటే గట్టిగా మూడు రోజులే సమయం ఉంది. ఈ ధర్నాకు పార్టీలోని నేతలు అంతా హాజరు కావాలని వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ధర్నా అని మొదట పేర్కొన్నారు. కానీ ఇపుడు చూస్తే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కో ఆర్డినేటర్లు, పార్టీలోని సీనియర్ నేతలు, లోకల్ బాడీస్ కి చెందిన ప్రజా ప్రతినిధులు అంతా రావాలని పిలుపు ఇచ్చారు.

ఇక ఎవరి ఖర్చులు వారివే అన్నట్లుగా వసతి ప్రయాణ సదుపాయాలు ఏర్పటు చేసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. దాంతో ఇపుడు వైసీపీలో కొత్త చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోట్లు పోసి ఓటమిని తెచ్చుకుని సర్వం ఆరిపోయామని అంటున్నారు నేతలు.

అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి తాము వసతి ప్రయాణం ఖర్చులు పెట్టుకుని ఎలా రావడం అని వారు మధన పడుతున్నారు. మరో వైపు ఎంత మంది వస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఆ ధర్నా ఏదో అమరావతిలోనో విజయవాడలోనో పెడితే చాలామంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఢిల్లీలో అంటే ఎంత మంది వెళ్తారు, ఎవరికి సావకాశం ఉంటుందని కూడా అంటున్నారు.

ఇక తొలి ప్రయత్నంగా నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పార్టీ జనాలు పెద్ద ఎత్తున కనిపించకపోతే అది ఇబ్బందికరం అవుతుందని కూడా అంటున్నారు. పార్టీయే ఖర్చులు పెట్టుకుని తీసుకుని వెళ్ళినా కొంతలో కొంత కళ కడుతుందని అంటున్నారు. అలా కాపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో ధర్నా చేసినా బాగానే ఉంటుందని అంటున్నారు.

ఇంకో వాదన కూడా ఉంది. ఏపీలో అసెంబ్లీ సాగుతోంది. కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అలా చట్ట సభలలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమస్య మీద ఎలుగెత్తి చాటితే బాగుంటుంది కదా అని అంటున్నారు. అక్కడ స్పందనను చూసుకున్న మీదట జనంలోకి వెళ్తే సబబుగా ఉంటుందని అంటున్నారు.

అయితే ఢిల్లీలో ధర్నా చేసి ప్రధాని సహా కీలక నేతల అపాయింట్మెంట్ కోరి వారికి ఏపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం ఉంది. కానీ ఇది టూ ఎర్లీగా ఉంటుందని దీని వల్ల ఏమిటి ప్రయోజనమని అంటున్న వారూ ఉన్నారు. ఇక టీడీపీ కూటమి నేతలు అయితే జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నిరసన ఎలా ఉండబోతోంది ఎవరు హాజరవుతారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News