క‌మ్మ వ‌ర్గం సానుభూతిపై జ‌గ‌న్ క‌న్ను.. !

అలానే.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగా వైసీపీ అధినేత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Update: 2025-02-22 15:30 GMT

రాద‌ని తెలిసినా ప్ర‌య‌త్నం చేయ‌డం.. స‌హ‌జం. రాజ‌కీయాల్లో అయితే .. ఈ ప్ర‌య‌త్నాలు మ‌రింత ఎక్కు వ‌గానే జ‌రుగుతాయి. ఏమో ల‌క్కుంటే ల‌భిస్తుంద‌న్న ఆశ నాయ‌కులు, రాజ‌కీయ పార్టీల్లోనూ క‌నిపిస్తుంది. అలానే.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగా వైసీపీ అధినేత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.వాస్త‌వానికి టీడీపీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు గ‌తంలోనూ జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు.

కొడాలి నానీ వంటివారికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా క‌మ్మ‌ల‌ను త‌న వైపు చూసే విధంగా ప్ర‌య‌త్నిం చారు. కానీ.. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు అనేక విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించింది. అంతేకాదు.. క‌మ్మ సామాజిక వ‌ర్గం మొత్తం ఏక‌మై... వైసీపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పి.. చంద్ర‌బాబును అధికారంలోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ కూడా అయింది. ఆ త‌ర్వాత‌.. కూడా క‌మ్మ‌లు వైసీపీకి వ్య‌తిరేకంగానే ప‌నిచేస్తూ వ‌చ్చారు.

కొన్నాళ్ల కింద‌ట క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ అధికారి ఒక‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడిం చేందుకు క‌మ్మ‌లు ఐక్యంగా ఉండాల‌ని సూచించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ‌వైపు క‌మ్మ సామాజిక వ‌ర్గం తిరుగుతుందా? మొగ్గు చూపుతుందా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. క‌మ్మ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు జ‌గ‌న్‌. స‌హ‌జంగా.. క‌మ్మ‌ల‌పై జ‌గ‌న్ అనేక ఆరోప‌ణ లు చేశారు. ప‌రిశ్ర‌మ‌లు కూడా రాకుండా వ్య‌వ‌హ‌రించార‌న్న అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు.. క‌మ్మ‌ల‌ను ఆక‌ర్షించేందుకే ఆయ‌న జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామార్శించార‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. దేవినేని అవినాష్‌, కొడాలి నాని వంటి వారిని ముందు పెట్టుకుని మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డం వెనుక కూడా.. జ‌గ‌న్ క‌మ్మ‌ల‌కు వ్య‌తిరేకం కాదు.. కేవ‌లం టీడీపీకే రాజ‌కీయంగా వ్య‌తిరేక‌మ‌న్న సంకేతాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మేధావులు చెబుతున్నారు. త‌ద్వారా ఓటు బ్యాంకు వ‌స్తుందా? లేదా? అన్న‌ది పక్క‌న పెడితే.. క‌మ్మ‌ల్లో సానుభూతిని కొంత వ‌ర‌కైనా నిలుపుకొనే ప్ర‌య‌త్నం అయితే చేస్తున్నార‌న్న‌ది వైసీపీ టాక్‌.

Tags:    

Similar News